వచ్చే పదేళ్లు ‘ఇండియాస్‌ టెకేడ్‌’: ప్రధాని మోదీ

9 Jul, 2021 06:05 IST|Sakshi

కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత విద్యలో సాంకేతికత

ఐఐటీ డైరెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో ప్రధాని మోదీ  

న్యూఢిల్లీ: మారుతున్న పరిస్థితుల్లో ఏర్పడే కొత్త సవాళ్లను అధిగమించేలా ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతిక రంగంలో పరిశోధన, అభివృద్ధికే పెద్ద పీట వేయాలన్నారు. అందుకే రానున్న పదేళ్ల కాలాన్ని ‘ఇండియాస్‌ టెకేడ్‌’ అని పిలుచుకోవచ్చునని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే వందకుపైగా ఐఐటీల డైరెక్టర్లలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. విద్యారంగంలో పెట్టే ప్రతీ పైసా సామాజిక పెట్టుబడి అని అన్న ప్రధాని స్తోమత, సమానత్వం, నాణ్యత, అనుసంధానం అన్నవే ఉన్నత విద్యను ముందుకు నడిపిస్తాయన్నారు.

విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సైబర్‌ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు.  కోవిడ్‌ విసిరిన సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ టెక్నాలజీ సంస్థలు చేసిన పరిశోధన, అభివృద్ధిని ప్రధాని కొనియాడారు. యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్‌ వేరబుల్స్, డిజిటల్‌ అసిస్టెంట్‌లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలన్నారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. సమావేశానంతరం ప్రధాని వాటి వివరాలను ట్వీట్‌ చేశారు.

ముప్పు తొలగిపోలేదు: ప్రధాని మోదీ
కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనాపై పోరు  సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు  పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రివర్గ సహచరులతో సమావేశం సందర్భంగా ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్‌ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. సమయానికి కార్యాలయాలకు రావాలని, ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు. గతంలో ఆయా శాఖలు నిర్వహించిన మంత్రులను కలుసుకుని వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. 

మరిన్ని వార్తలు