మార్పు దిశగా భారత్‌ అడుగులు

22 Nov, 2020 04:55 IST|Sakshi

వచ్చే పాతికేళ్లు అత్యంత కీలక దశ

యువతరం చేతిలోనే దేశ భవిష్యత్‌

పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం వర్సిటీ విద్యార్థులతో ప్రధాని

న్యూఢిల్లీ: భారత్‌ మార్పు దిశగా అడుగులు వేస్తోందని రాబోయే 25 ఏళ్లు దేశాభివృద్దికి అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అత్యంత పటిష్టంగా నిలపాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు. పండిట్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ (పీడీపీయూ) కాన్వకేషన్‌ సదస్సులో శనివారం విద్యార్థులనుద్దేశించి ప్రధాని ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం భారత్‌ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఒక రకంగా దేశంలో స్వర్ణయుగం నడుస్తున్న సమయంలో మనం ఉన్నాం.

దేశ భవిష్యత్తుని వైభవంగా తీర్చిదిద్దే బాధ్యత మీ పైనే ఉంది’’అని ప్రధాని చెప్పారు.  ఎవరైతే దేశాన్ని ముందుకు నడిపించాలని బాధ్యత తీసుకుంటారో వారే విజయం సాధిస్తారని, బాధ్యతని బరువుగా భావించే వారు ఓటమి పాలవుతారని హితవు పలికారు. కర్బన ఉద్గారాలను 30 నుంచి 35శాతం వరకు తగ్గించడమే తమ లక్ష్యమని ప్రధాని చెప్పారు. గత దశాబ్ద కాలంలో సహజ వాయువుల వినియోగం 4 రెట్లు పెరిగిందని, వచ్చే అయిదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు.  ఒకప్పుడు సోలార్‌ విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.12–13 ఉంటే, ఇప్పడు యూనిట్‌ రూ.2కే లభిస్తోందన్నారు. 2022 నాటికి 175 గిగావాట్ల సౌర విద్యుత్‌ వాటకం పెరుగుతుందని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు