మోదీ మన్‌ కీ బాత్‌: ఆ ఘటన బాధాకరం

31 Jan, 2021 12:13 IST|Sakshi

కరోనా వ్యాక్సిన్‌తో ప్రజల్లో ఆత్మవిశ్వాసం

‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ

బోయిన్‌పల్లి సబ్జీ మండి ప్రస్తావన

సాక్షి, ఢిల్లీ: గణతంత్ర దినోతవ్సం రోజున ఎర్రకోటలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో కొంత మంది ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగురవేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాదిలో తొలిసారిగా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన ఆదివారం ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్‌తో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. భారత్‌ను చాలా దేశాలు ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రెజిల్ రాష్ట్రపతి కూడా భారత్‌ వ్యాక్సిన్‌ను ప్రశంసించారని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో జరుగుతోందని ప్రధాని తెలిపారు. 15 రోజుల్లోనే 30లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశామని పేర్కొన్నారు. (చదవండి: ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ )

‘‘అమెరికా వంటి అగ్రదేశానికి 18 రోజులు, బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. మేడిన్‌ ఇండియాలో భాగంగా చేపట్టిన వ్యాక్సిన్‌ భారత్‌ ఆత్మ నిర్భరతకు ప్రతీక. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ దేశ ఆత్మగౌరవానికి ప్రతీక’’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో భారత్ విజయం స్ఫూర్తిదాయకమని.. భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. (చదవండి: ఫోన్‌ చేస్తే చాలు..చర్చలకు సిద్ధం..)

మన్‌కీ బాత్‌లో బోయిన్‌పల్లి సబ్జీ మండి ప్రస్తావన..
ప్రధాని మోదీ.. మన్‌కీ బాత్‌లో హైదరాబాద్‌ బోయిన్‌పల్లి సబ్జీ మండి గురించి ప్రస్తావించారు. సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని పేర్కొన్నారు. సబ్జీ మండిలో ప్రతిరోజు  10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, 30 కేజీల జీవ ఇంధనంతో పాటు 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ప్రధాని తెలిపారు.

మరిన్ని వార్తలు