100 Crore Vaccine Milestone: ‘అక్టోబర్‌ 21 దేశ చరిత్రలో ఓ మైలురాయి’

22 Oct, 2021 10:35 IST|Sakshi

ప్రస్తుతం 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి

కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలి ఆయుధం

కోవిన్‌ వల్ల టీకాలను సులభతరంగా, పారదర్శకంగా అందించాం

ప్రస్తుతం మేడిన్‌ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది

న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాటంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. మహమ్మారి కట్టడి కోసం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో అక్టోబర్‌ 21(గురువారం) వరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం నరేంద్ర మోదీ జాతీనుద్దేశించి ప్రసంగించారు. భారత్‌ వంద కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘100 కోట్ల డోసులు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామర్థ్యానికి ప్రతీక. మన దేశం ఎంత సంకల్ప బద్ధంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. భారత్‌ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో మనం విదేశాల నుంచి వ్యాక్సిన్‌ తెప్పించుకునేవాళ్లం. ఇప్పుడు విదేశాలకు టీకాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. శతాబ్ధి కాలంలో ఎన్నడూ చూడనటువంటి మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసింది. ఈ మమమ్మారిని అడ్డుకునేందుకు భారత్‌ వ్యాక్సిన్‌లను ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాయి’’ అన్నారు. 
(చదవండి: ప్రపంచానికే పాఠాలు!)

‘‘కోవిడ్‌ మనకో సవాల్‌ విసిరింది.. భారత్‌ శక్తి ఏంటో చూపించాం. కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని తొలి ఆయుధంగా మలుచుకున్నాం. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు సురక్షిత దేశంగా చూస్తోంది. భారత్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా మరింత మన్ననలు పొందుతోంది. 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పూర్తి చేయడం అనేది అద్భుత విజయం. మన టెక్నాలజీ, సామర్థ్యానికి ప్రతీక’’ అన్నారు. 
(చదవండి: డెల్టా వేరియంట్‌పై కోవిషీల్డ్‌ 90% రక్షణ)

‘‘కోవిన్‌ వల్ల టీకాలను సులభతరంగా, పారదర్శకంగా అందిస్తున్నాం. వ్యాక్సిన్‌ సరఫరాను సవాల్‌గా తీసుకున్నాం. అందరికి ఉచితంగా టీకా ఇచ్చాం. శాస్త్రీయ దృక్పథంతో వ్యాక్సిన్‌ పంపిణీ చేశాం. ప్రస్తుతం మేడిన్‌ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, ఉత్సామం కనిపిస్తోంది. అయితే రక్షణ కవచం ఉందని నిర్లక్ష్యం వద్దు. కరోనా ఇంకా కొనసాగుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలి’’ అన్నారు మోదీ. 

చదవండి: శతకోటి సంబరం!

మరిన్ని వార్తలు