జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ

7 Dec, 2022 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్‌ ఆవరణలో జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. 

‘శీతాకాల సమావేశాల తొలి రోజు ఇది. మనం ఆగస్టు 15కు ముందు సమావేశమైనందున చాలా ముఖ్యమైనది. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకున్నాం. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిన తరుణంలో సమావేశమవుతున్నాం. గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం.

జీ20 సమ్మిట్‌ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. 

ఇదీ చదవండి: లఖీంపూర్‌ కేసులో 13 మందిపై అభియోగాలు

మరిన్ని వార్తలు