Draupadi Murmu: ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ‘భారత్‌కు ఉద్వేగభరిత క్షణం’..

25 Jul, 2022 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశ అత్యున్నత పీఠంపై ద్రౌపదీ ముర్ము ఆసీనులయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది.  ఈ సందర్భంగా  దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.  దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణమని హర్షం వ్యక్తం చేశారు.

‘రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవాన్ని దేశం మొత్తం గర‍్వంగా వీక్షించింది. ఆమె రాష్ట్రపతి పదవిని చేపట్టడం దేశానికి ముఖ్యంగా పేదలు, అట్టడుగు అణగారిన వర్గాలకు ఉద్విగ్నభరిత క్షణాలు. ఆమె తన పదవి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘ భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు. మీ పదవీకాలంలో దేశ గౌరవాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది.. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు. ప్రజాస్వామ్య విలువలను అనుసరించే ప్రతి విభాగం సాధికారతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ.’ అని పేర్కొన్నారు. 
చదవండి: రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము

ప్రమాణ స్వీకారం అనంతరం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలిసారి ప్రసంగించారు. అత్యున్నత ప‌ద‌వికి ఎన్నిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.  దేశ ప్ర‌జ‌ల విశ్వాసం నిల‌బెట్టుకునేలా పనిచేస్తాన‌న్నారు.

కాగా  రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ఘన విజయం సాధించారు.  భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్‌ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించారు.

మరిన్ని వార్తలు