రైతుల నిరసన వెనక విపక్షాలు: ప్రధాని

30 Nov, 2020 19:18 IST|Sakshi

రైతుల నిరసన వెనక విపక్షాలు

తప్పుడు సమాచారంతో భయాందోళనలు రేకేత్తిస్తున్నారు

యోగి హాయంలో యూపీలో మెరుగైన అభివృద్ధి

వారణాసి/లక్నో: ‘దేవ్‌ దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. దీపం వెలిగించి ‘దేవ్ దీపావళి ’మహోత్సవాన్ని ప్రారంభించారు. అంతకు ముందు వారణాసిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మోదీ. కరోనా నేపథ్యంలో నెలల విరామం తర్వాత మోదీ తన నియోజకవర్గంలో పర్యటించారు. బబత్‌పూర్‌ విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడి నుంచి ఖాజురి చేరుకున్నారు. జాతియ రహదారి 19 విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన హందియా(ప్రయాగ్‌రాజ్‌)-రాజతలాబ్‌(వారణాసి) రహదారిని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఇక ‘హర్‌ హర్‌ మహదేవ్’‌ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ప్రజలకు ‘దేవ్‌ దీపావళి’, ‘గురునానక్‌ జయంతి’ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు జాతికి అంకితం చేసిన రహదారి కాశీ ప్రజలతో పాటు ప్రయాగరాజ్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది అన్నారు. (చదవండి: సాగు చట్టాలతో రైతులకు లాభం)

గురు నానక్ జయంతి, దేవ్ దీపావళి సందర్భంగా వారణాసి మెరుగైన మౌలిక సదుపాయాలను పొందుతోంది అన్నారు మోదీ. దీని వల్ల వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ రెండు ప్రాంతాలకు లాభం చేకూరుతుంది అన్నారు. 2,447 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ అలహాబాద్-వారణాసిల మధ్య ప్రయాణ సమయాన్ని గంటకు తగ్గించనుంది. ఇక తన ప్రసంగంలో మోదీ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళన వెనక విపక్షాలున్నాయని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త చట్టాలు దళారుల కబంద హస్తాల నుంచి రైతులను కాపాడతాయని మోదీ తెలిపారు. (చదవండి: మీరు రైతులకు అవగాహన కల్పించండి!)

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అయ్యిందన్నారు మోదీ. “2017కి ముందు యూపీలో మౌలిక సదుపాయాల స్థితి ఏమిటో అందరికీ తెలుసు. కానీ యోగి జీ ముఖ్యమంత్రి అయిన తరువాత మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పెరిగింది. ఈ రోజు యూపీని ఎక్స్‌ప్రెస్ ప్రదేశ్ అని పిలుస్తున్నారు’’ అంటూ మోదీ ఉత్తరప్రదేశ్‌ సీఎంపై ప్రశంసలు కురపించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు