మెట్రోలో టికెట్‌ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!

7 Mar, 2022 07:39 IST|Sakshi

పుణే మెట్రో రైలు ప్రాజెక్టులో 12 కిలోమీటర్లు ప్రారంభం

రైలులో ప్రయాణించిన ప్రధానమంత్రి

పుణే: నగరాలు, పట్టణాల్లో మెట్రో రైలు అనుసంధానంతో సహా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మహారాష్ట్రలోని పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. గర్వారే స్టేషన్‌లో రైలుకు పంచ్చజెండా ఊపారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఐటీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు తానే పునాది రాయి వేసి, ఇప్పుడు తన చేతుల మీదుగానే ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేయడం మినహా అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలిసేది కాదని పేర్కొన్నారు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయొచ్చన్న సందేశం ఈ మెట్రో రైలు ప్రాజెక్టుతో ప్రజల్లోకి వెళ్లిందని వివరించారు. పనుల్లో జాప్యం జరిగితే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. మెట్రో రైళ్లలో విరివిగా ప్రయాణించాలని కోరారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని, 2030 నాటికి దేశ జనాభాలో 60 కోట్ల మంది నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తారని పేర్కొన్నారు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరాలు, పట్టణాల్లో రోడ్లను వెడల్పు చేయడం, ఫ్లైఓవర్లు నిర్మించడం కష్టం కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఆధునిక యుగంలో మెట్రో రైలు అనుసంధానం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి రావడం లేదా నిర్మాణంలో ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రధాని మోదీ స్వయంగా టికెట్‌ కొనుక్కొని పుణే మెట్రో రైలులో గర్వారే నుంచి ఆనంద్‌నగర్‌ స్టేషన్‌ వరకు దాదాపు 10 నిమిషాలపాటు ప్రయాణించారు. రైలులో తనతో పాటు ప్రయాణిస్తున్న దివ్యాంగ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. పుణేలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2016 డిసెంబర్‌ 24న శంకుస్థాపన చేశారు. రూ.11,400 కోట్లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొత్తం 32.2 కిలోమీటర్లకు గాను నిర్మాణం పూర్తయిన 12 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు.
చదవండి: పెద్ద దేశాలకే ఇబ్బంది.. భారతీయుల తరలింపుపై మోదీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు