సామాన్యుడిలా క్యూలో వెళ్లి ఓటేసిన మోదీ.. కాంగ్రెస్‌ విమర్శలు!

5 Dec, 2022 16:58 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయమే గాంధీనగర్‌ రాజ్‌భవన్‌ నుంచి అహ్మదాబాద్‌ చేరుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. రాణిప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఒక సామాన్యుడిలా క్యూ లైన్‌లో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు వేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

రోడ్‌ షో అంటూ.. కాంగ్రెస్‌ విమర్శలు
అహ్మదాబాద్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన ప్రధాని మోదీ.. పోలింగ్‌ కేంద్రానికి కొద్ది దూరంలోనే కాన్వాయ్‌ని నిలిపేసి నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ప్రధానిని చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేసుకుంటూ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు మోదీ. ఓటు వేసి తిరిగి వెళ్లేప్పుడు సైతం అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రానికి ప్రధాని నడుచుకుంటూ వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మోదీ రోడ్‌ షో నిర్వహించారని ఆరోపించింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం విచారకరమని విమర్శించింది. 

మరోవైపు.. ప్రధాని మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఓటింగ్‌ సమయంలో రోడ్‌ షో లాంటి కార్యక్రమం చేపట్టడమేంటని ప్రశ్నించారు. వారు ప్రత్యేకమైన వ్యక్తులు అంటూ విమర్శించారు. ఎన్నికల రోజున రోడ్‌ షోలపై నిషేధం ఉంటుందని, కానీ వారు అందుకు మినహాయింపు అంటూ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: Gujarat Assembly Elections 2022: మధ్యాహ్నం 3 గంటల వరకు 50శాతం ఓటింగ్‌

మరిన్ని వార్తలు