వైఎస్సార్‌ సీపీ ఎంపీ మృతి; ప్రధాని సంతాపం

16 Sep, 2020 20:13 IST|Sakshi

న్యూఢిల్లీ: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారంటూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు ప్రధాని మోదీ బుధవారం ట్వీట్‌ చేశారు. కాగా ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. గత కొన్ని రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న ఆయనకు బుధవారం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.(చదవండి: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత)

ఆయన సేవలు చిరస్మరణనీయం: ఉపరాష్ట్రపతి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారు దివంగతులయ్యారని తెలిసి తీవ్రంగా విచారించాను. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. 28 ఏళ్ళ వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించిన శ్రీ దుర్గా ప్రసాద్ గారు అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. పార్లమెంటేరియన్ గా, నాలుగు పర్యాయాలు గూడూరు శాసనసభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా వారు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీ దుర్గా ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’అని ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: ఓం బిర్లా
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సంతాపం తెలిపారు. ‘‘తిరుపతి (ఆంధ్రప్రదేశ్) లోక్ సభ ఎంపీ శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారి విషాదకరమయిన మరణ వార్త తెలిసి చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓం శాంతిః’’ అని తెలుగులో ట్వీట్‌ చేశారు.

గవర్నర్‌ సంతాపం
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా, ప్రాథమిక విద్యామంత్రిగా ఆయన ఎనలేని సేవ చేశారన్నారు. ఎంపీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
లోక్‌సభ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజా సేవలో అవిరళ కృషి చేసిన ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు