ప్రధాని మోదీ కాన్వాయ్‌ నిలిపేసి.. అంబులెన్స్‌కు దారి

30 Sep, 2022 16:25 IST|Sakshi

గాంధీనగర్‌:  గుజరాత్‌ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే అహ్మాదాబాద్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తున్న సమయంలో అంబులెన్స్‌కు దారిచూపి ఔదార్యాన్ని చాటుకున్నారు. అంబులెన్స్‌ రాకను గమనించిన క్రమంలో ప్రధాని మోదీ కాన్వాయ్‌ని పక్కకు నిలిపేసి అంబులెన్స్‌కు రూట్‌ క్లియర్‌ చేశారు. ఈ వీడియోను గుజరాత్‌ బీజేపీ షేర్‌ చేసింది. అందులో పీఎం కాన్వాయ్‌లో భాగమైన రెండు ఎస్‌యూవీ కార్లు.. నెమ్మదిగా రోడ్డు పక్కకు వెళ్తుండగా.. అంబులెన్స్‌ దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

అహ్మదాబాద్‌లోని దూరదర్శన్‌ కేంద్రానికి సమీపంలో పబ్లిక్‌ ర్యాలీ ముగించుకుని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు ప్రధాని మోదీ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ‘అహ్మదాబాద్‌ నుంచి గాంధీ నగర్‌ వెళ్తున్న క్రమంలో అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు పీఎం మోదీ కాన్వాయ్‌ నిలిపేశారు.’ అని గుజరాత్‌ బీజేపీ పేర్కొంది. గుజరాత్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా గాంధీనగర్‌- ముంబై వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు మోదీ. అలాగే.. అహ్మదాబాద్‌ మెట్రో ప్రాజెక్టు తొలిదశ పనులను ప్రారంభించారు.

ఇదీ చదవండి: పొలిటికల్‌ ట్విస్ట్‌.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు?

మరిన్ని వార్తలు