ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా.. అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని

3 Oct, 2022 13:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనారోగ్యంత గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్‌కు మొదట ప్రవేటు వార్డులో చికిత్స అందించారు వైద్యులు. అయితే అకస్మాతుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం హూటాహుటిన ఐసీయూకు తరలించారు. దీంతో అఖిలేశ్ సహా ఇతర కుటుంబసభ్యులంతా ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు.

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి.

అయితే ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్ ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు. ఆయనను చూసేందుకు ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు.
చదవండి: మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక

మరిన్ని వార్తలు