జమ్మూకశ్మీర్‌లో నవశకం

25 Apr, 2022 12:33 IST|Sakshi
పల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన వందలాది మంది జనం. (ఇన్‌సెట్లో) ప్రసంగిస్తున్న ప్రధాని

పల్లి: ప్రజాస్వామ్యం, కృతనిశ్చయం విషయంలో జమ్మూ కశ్మీర్‌ సరికొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రెండుమూడేళ్లుగా తమ ప్రభుత్వం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారి మోదీ కశ్మీర్‌లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 20వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

వీటిలో బనిహాల్‌– ఖాజీగుండ్‌ రోడ్‌ టన్నెల్‌ కూడా ఉంది. దీనివల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు. పంచాయతీ దివస్‌ ర్యాలీని పురస్కరించుకొని దేశంలోని అన్ని పంచాయతీలను ఉద్దేశించి ఆయన పల్లి గ్రామంలో ప్రసంగించారు. గత రెండేళ్లలో లోయలో రూ. 38వేల కోట్ల ప్రైవేట్‌ పెట్టుబడులు వచ్చాయని, టూరిస్టులు కూడా పెరిగారని చెప్పారు. అంతకు ముందు 7 దశాబ్దాల కాలంలో కశ్మీర్‌కు కేవలం 17 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు.

ప్రజలకు మేలు చేసే కేంద్ర చట్టాలు గతంలో ఇక్కడ అమలయ్యేవి కావని, కానీ తమ ప్రభుత్వం దాదాపు 175 కేంద్ర చట్టాలను, పంచాయతీ వ్యవస్థను అమలు చేసి, ఇక్కడి ప్రజల సాధికారతకు దోహదం చేస్తోందని చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌లో ఇటీవల ప్రశాంతంగా మూడంచెల పంచాయతీ రాజ్‌ ఎన్నికలు జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి పంచాయతీల బలోపేతానికి తమ ప్రభుత్వం రూ. 22వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. రాబోయే 25ఏళ్లు జమ్మూ, కశ్మీర్‌ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతుందన్నారు. సరిహద్దు గ్రామాల మధ్య ఏడాది మొత్తం కనెక్టివిటీ ఉండేలా చూస్తామన్నారు.  

తొలి కార్బన్‌ రహిత పంచాయతీ
జమ్ము, కశ్మీర్లో పల్లి గ్రామ పంచాయతీ దేశంలోనే తొలి కార్బన్‌ రహిత(కార్బన్‌ న్యూట్రల్‌) పంచాయతీగా చరిత్రకెక్కింది. ఇక్కడ ప్రధాని మోదీ 500 కిలోవాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఆరంభించి జాతికి అంకితం చేశారు. దేశానికి కార్బన్‌రహిత మార్గాన్ని పల్లి చూపుతుందని మోదీ చెప్పారు. స్థానిక ప్రజల సహకారంతోనే ఈ ప్రాజెక్టు సాకారమైందని ఆయన కొనియాడారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 6,408 మీటర్ల ప్రాంతంలో 1,500 సోలార్‌ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. దీనివల్ల 340 గృహాలకు పర్యావరణ హితమైన విద్యుత్‌ లభిస్తుంది.

గ్రామ్‌ ఊర్జా స్వరాజ్‌ ప్రోగ్రాం కింద ఈ ప్లాంట్‌ను నిర్మించామని, ఇందుకు రూ. 2.75 కోట్ల వ్యయమైందని అధికారులు తెలిపారు. . ప్రధాని చొరవతో తమకు ఈ ప్రాజెక్టు లభించిందని గ్రామవాసులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో పది సోలార్‌ పంపులు ఏర్పాటయ్యాయని, త్వరలో మరో 40 ఏర్పాటు చేస్తారని సర్పంచ్‌ రవీందర్‌ చెప్పారు. గ్రామంలో ఎలక్ట్రిక్‌ బస్, నూతన ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ ఆఫీసును ఏర్పాటు చేశారన్నారు. గ్రామవాసులు ఆర్గానిక్‌ వ్యవసాయం వైపు మరలాలని ప్రధాని వారికి సూచించారు.

మీ పూర్వీకుల కష్టాలు మీకుండవు!
కశ్మీర్‌ లోయలో యువత తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. లోయలో అభివృద్ధికి, శాంతి స్థాపనకు ఆయన పలు కార్యక్రమాలను ప్రకటించారు.  ‘మీ తాతలు, తల్లిదండ్రులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత యువత మాత్రం అలాంటి కష్టాల జీవితాన్ని జీవించదు. నేను హామీ ఇస్తున్నాను’’ అని మోదీ కశ్మీరీలకు భరోసా ఇచ్చారు.  యువత తన మాటలపై విశ్వాసం ఉంచాలని కోరారు. తాజాగా చేపట్టిన కార్యక్రమాలు లోయలో యువతకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. గత రెండుమూడేళ్లుగా జమ్మూ, కశ్మీర్‌లో కొత్త అభివృద్ధి చోటు చేసుకుంటోందని మోదీ చెప్పారు. దశాబ్దాల తర్వాత పంచాయతీ రాజ్‌ దివస్‌ లాంటి కార్యక్రమాలను కశ్మీర్‌ ప్రజలు జరుపుకోగలుగుతున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తలు