Vande Bharat: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్‌.. జెండా ఊపిన ప్రధాని మోదీ

11 Nov, 2022 12:04 IST|Sakshi

బెంగళూరు: దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అధికారికంగా పట్టాలెక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటక బెంగళూరు క్రాంతివీర సంగోలీ రాయన్న రైల్వే స్టేషన్‌(KSR Railway Station) నుంచి రైలును ప్రారంభించారు. చెన్నై(తమిళనాడు) నుంచి వయా బెంగళూరు మీదుగా మైసూర్‌ మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. 

దేశంలో ఇప్పటివరకు పరుగులు పెడుతున్న సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఇది ఐదవది. ఇండియన్‌ రైల్వేస్‌ ఆధ్వర్యంలో నడిచే మిగతా నాలుగు నార్త్‌లో ఇప్పటికే పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే మైసూర్‌-చెన్నై వందే భారత్‌ విజయవంతంగా ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుంది కూడా. వందే భారత్‌ రైలు ప్రారంభంతో పాటు భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైలుకు సైతం ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపారు. 

అంతకు ముందు విధాన సభ వద్ద కనకదాస, మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని మోదీ పూల నివాళి అర్పించారు. బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్‌ 2ను ప్రారంభించడంతో పాటు ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ నాదప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మరిన్ని వార్తలు