కాంగ్రెస్‌ నల్ల దుస్తులపై ప్రధాని మోదీ ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ విమర్శలు

10 Aug, 2022 19:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల నల్ల దుస్తులు ధరించి నిరసనలు చేపట్టటాన్ని సూచిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బ్లాక్‌ మ్యాజిక్‌ను నమ్మేవారు ఎప్పటికీ ప్రజల నమ్మకాన్ని సంపాదించలేరని ఆరోపించారు. ‘నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన కొందరు చేతబడిని నమ్ముకుంటున్నారు.  బ్లాక్‌ మ్యాజిక్‌ను ప్రచారం చేసే ప్రయత్నాన్ని ఇటీవల ఆగస్టు 5న చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే వారి వైరాగ్య కాలం ముగిసిపోతుందని భావిస్తున్నారు. కానీ, వారు ఎంత బ్లాక్‌ మ్యాజిక్‌, చేతబడి, అతీత శక్తులను ప్రదర్శించే ప్రయత్నం చేసినా ప్రజల నమ్మకాన్ని పొందలేరు.’ అని విమర్శించారు నరేంద్ర మోదీ. 

మరోవైపు.. నిరసనల రోజున కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, నల్లదుస్తులు ధరించి నిరసనలు చేయటం అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపనను వ్యతిరేకించినట్లేనన్నారు. నల్ల దుస్తులు ధరించి ముందుగా ఛలో రాష్ట్రపతి భవన్‌ మార్చ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రణాళిక రచించింది. అయితే.. వారిని అడ్డుకున్న పోలీసులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు సహా కీలక నేతలను అరెస్ట్‌ చేశారు. ప్రియాంక గాంధీని బలవంతంగా లాక్కెళుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారా?

మరిన్ని వార్తలు