PM MODI: మీరు అనుభవించే బాధను..నేను అనుభవిస్తున్నాను!

15 May, 2021 14:47 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ప్రాణ వాయువు సకాలంలో అందడం లేదు. దీంతో అధిక సంఖ్యలో కరోనా రోగులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం దేశంలో 2.43 కోట్లకు పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత భారత్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ ​క్రమంలో  కరోనా కట్టడిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ మేరకు మోదీ మాట్లాడుతూ.. సెకండ్‌వేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయడమే కాకుండా, ఇంటింటి సర్వే, టెస్టింగ్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. 

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పడుతున్న బాధలపై శుక్రవారం జరిగిన సమావేశంలో మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎంత బాధ పడ్డారో..నేను అంతే బాధను అనుభవిస్తున్నాను. ఈ 100 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అడుగడుగునా పరీక్షిస్తోంది. ఇది కంటికి కనిపించని శత్రువు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆస్పత్రులు ఉచితంగా టీకాలు అందిస్తున్నాయి. కాబట్టి మీవంతు వచ్చినపుడు తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలి’ అని మోదీ కోరారు.

ఇక మూడు వారాలుగా దేశంలో 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3.26 లక్షల కేసులతో నమోదు కాగా..మొత్తం కేసులు 2.43 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఆక్సిజన్‌ కొరత కారణంగా కరోనా రోగులు మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, మందుల కోసం సోషల్‌ మీడియాలో అభ్యర్థనలు వెల్లువెత్తున్నాయి. కరోనా కారణంగా అత్యధిక ప్రభావం చూపించిన జిల్లా అధికారులతో వచ్చే మంగళవారం, గురువారాల్లో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. 

(చదవండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం..)

మరిన్ని వార్తలు