వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీగా పెంచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం

19 May, 2021 02:23 IST|Sakshi

15 రోజుల వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ రాష్ట్రాలకు ఇచ్చేందుకు చర్యలు 

‍కలెక్టర్లతో సమావేశంలో మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ సరఫరాను భారీగా పెంచేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో పాటు వ్యవస్థ క్రమబద్ధీకరణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టిందని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే 15 రోజుల వ్యాక్సినేషన్‌ షెడ్యూలును రాష్ట్రాలకు ముందుగానే అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనాపై పోరులో వ్యాక్సినేషన్‌ ప్రధాన ఆయుధమని, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను సమష్టికృషితో తొలగించాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్‌లు వృథా కాకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు.

మంగళవారం కోవిడ్‌ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అనుభవాలను తెలియజేయాలని అధికారులను ప్రధాని కోరారు. ఆసుపత్రులలో పడకలతో పాటు వ్యాక్సిన్ల లభ్యతపై ప్రజలకు సరైన సమాచారం అందించాలని, అప్పుడే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రధాని తెలిపారు. స్థానిక అవసరాలను తగ్గట్లుగా వినూత్న విధానాలను అవలంభించాలని, కలెక్టర్లకు ఆ స్వేచ్ఛ ఉందన్నారు.   ఆయా జిల్లాల్లోని సవాళ్లేమిటో స్థానిక అధికారులకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి జిల్లాల్లో మహమ్మారిపై విజయం సాధిస్తే దేశానికి విజయం లభించనట్లేనని అన్నారు. 


మీరే ఫీల్డ్‌ కమాండర్లు 
ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్, పాలన యంత్రాంగంలోని అధికారవర్గాలు చూపుతున్న అంకితభావాన్ని మోదీ అభినందించారు. కరోనాపై పోరాటంలో మీరే ఫీల్డ్‌ కమాండర్లు అని కలెక్టర్లనుద్దేశించి మోదీ అన్నారు. స్థానికంగా ఎక్కడిక్కడ కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటు, విస్తృతస్థాయిలో కరోనా పరీక్షలు, ప్రజలకు సరైన–సమగ్ర సమాచారం ఇవ్వడం వంటి అంశాలు ప్రస్తుతం దేశంలో వైరస్‌పై చేస్తున్న యుద్ధంలో ప్రధాన ఆయుధాలని ప్రధాని వివరించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగా, అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు