కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ పేరే ఎందుకో తెలుసా?

8 Sep, 2022 21:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక మార్గమైన రాజ్‌పథ్‌.. కర్తవ్యపథ్‌గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. కొత్త రూపం సంతరించుకున్న ఈ సెంట్రల్‌ విస్టా స్ట్రెచ్‌ను కాసేపటి కిందట ప్రధాన మంత్రి నరేంద్రం మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు సైతం పాల్గొన్నారు. 

గురువారం సాయంత్రం.. ఇండియా గేట్‌ దగ్గర 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ముందుగా ఆవిష్కరించారు. పూలు జల్లి స్వాతంత్ర ఉద్యమ వీరుడికి నివాళి అర్పించారు.  అనంతరం కర్తవ్యపథ్‌ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియా గేట్‌ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి.. రైజినా హిల్స్‌ రాష్ట్రపతి భవన్‌ దాకా మూడున్నర కిలోమీటర్ల మేర కర్తవ్యపథ్‌ కొత్త హంగులతో సిద్ధమైంది ఇప్పుడు.   

వలస పాలనలోని అవశేషాలు, కట్టడాల తొలగింపులో భాగంగా నరేంద్ర మోదీ హయాంలోని కేంద్రం ప్రభుత్వం పలు పేర్లను మార్చేయడం, కట్టడాలను పునర్మించడం చేస్తోంది. నూతన పార్లమెంట్‌ భవనం, ప్రధాని నివాసం-కార్యాలయంతో కూడిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తు‍న్న వాళ్లను శ్రమజీవులుగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. రిపబ్లిక్‌ డే పరేడ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని స్వయంగా వాళ్లతోనే వెల్లడించారు కూడా. అనంతరం సెంట్రల్‌ విస్టా అవెన్యూ పునరద్దరణ ప్రాజెక్టును ప్రధాని మోదీ పరిశీలించారు. 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రోజు అతిపెద్ద పరివర్తన ప్రాజెక్టు ఆవిష్కృతమవుతోంది. కర్తవ్య మార్గం దేశరాజధాని గుండెలాంటిది. ఈ దేశ ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యం. వారిని పాలించడం కాదని గుర్తు చేసేందుకే కర్తవ్య మార్గం అని పేరుపెట్టాం అని కేంద్రం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ తెలిపారు.

20 నెలల తర్వాత పునరాభివృద్ధి పనుల అనంతరం ఈ మార్గం(కర్తవ్యపథ్‌).. ప్రజా సందర్శనార్థం రేపటి(శుక్రవారం) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సరికొత్త హంగులతో కర్తవ్యపథ్‌ జనాలను ఆకట్టుకుంటుందని న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి: రాజ్‌పథ్‌ను కట్టిందెవరు? చారిత్రక నేపథ్యం వెనుక ఆసక్తికరమైన అంశాలెన్నో..

మరిన్ని వార్తలు