హైస్పీడ్ బ్రాడ్ బాండ్ : వారికి చాలా ప్రత్యేకమైన రోజు

10 Aug, 2020 11:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: చెన్నై-పోర్ట్ బ్లెయిర్‌ మధ్య సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. పోర్ట్ బ్లెయిర్‌తో పాటు మరో 7 ద్వీపాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ అందించేలా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దీన్ని ఆవిష్కరించారు. 

ఓఎఫ్‌సీతో అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంద‌ని మోదీ తెలిపారు.  చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు, పోర్ట్ బ్లెయిర్ నుండి లిటిల్ అండమాన్, పోర్ట్ బ్లెయిర్ నుండి స్వరాజ్ ద్వీపం వరకు ఈ సేవ ప్రారంభమైందన్నారు. అంతులేని అవకాశాలతో నిండిన ఈ ఆవిష్కారంపై అండమాన్ అండ్ నికోబార్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. అండమాన్ వాసులకు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, వేగవంతమైన, నమ్మదగిన మొబైల్, ల్యాండ్‌లైన్ టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా డిజిటల్ ఇండియా ఫలాలు అందుతాయ‌న్నారు. టూరిజం, బ్యాంకింగ్‌, షాపింగ్‌, టెలి మెడిసిన్, టెలీ విద్యలాంటి వ‌స‌తులు సులువుగా అందుతాయన్నారు.  అలాగే అనుకున్న స‌మ‌యానికి 2300 కిలోమీటర్ల దూరం స‌ముద్రం లోప‌ల కేబుల్ వేయ‌డం ప్రశంసనీయమన్నారు.

ప్రధానంగా టూరిజం మెరుగుపడుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. అక్కడి వారికి నేడు చాలా ప్రత్యేకమైన రోజు అని స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం లభిస్తుందంటూ  సోమవారం ఉదయం  మోదీ ట్వీట్ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో 2018 డిసెంబర్ 30న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు