-

ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ

15 Jun, 2022 07:49 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మానవ వనరుల లభ్యతపై మంగళవారం మోదీ లోతుగా సమీక్ష జరిపారు. అనంతరం అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు’’ అని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు ట్వీట్‌ చేసింది. 2020 మార్చి 1 నాటికి కేంద్రంలో 40.78 లక్షల ఉద్యోగాలు మంజూరు చేయగా 31.91 లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు. 21 శాతానికి పైగా ఖాళీలున్నట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ ఆన్‌ పే అండ్‌ అలవెన్స్‌ నివేదిక తెలిపింది. ప్రధాని తాజా ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వివిధ శాఖలు తమ వద్ద ఉన్న ఖాళీల సంఖ్యను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. 

యువతలో కొత్త ఆశలు: అమిత్‌ షా 
ప్రధాని ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగ యువతలో కొత్త ఆశల్ని, కొంగొత్త ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ‘‘యువత సాధికారత సాధిస్తేనే మోదీ కలలుగంటున్న నూతన భారత్‌ ఆవిష్కృతమవుతుంది. అందుకే యుద్ధప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆదేశాలిచ్చారు’’ అని చెప్పాన్నారు. 

నిరర్ధక హామీలు: రాహుల్‌  
మోదీ 10 లక్షల ఉద్యోగాల ప్రకటనను ఉత్తుత్తి మాటలుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను మోసగించారు. ఇప్పుడూ అదే తరహాలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటున్నారు’’ అని ట్వీట్‌ చేశారు.  
‘‘మోదీవి మాయ మాటలు.

ఉద్యోగాలు కల్పించడం ఆయనకు చేతకాదు. వాటిపై వార్తలు పుట్టించడంలో మాత్రం దిట్ట’’ అంటూ ఎద్దేవా చేశారు. 30 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. ఎన్నాళ్లిలా మాటలతో బురిడీ కొట్టిస్తారని ప్రశ్నించారు. మోదీ ప్రకటనల ప్రధాని మాత్రమేనని సీపీఎం, బీఎస్పీ దుయ్యబట్టాయి.

ఎందుకీ జాబ్‌ మేళా? 
ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆదేశాలివ్వడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. కరోనా దెబ్బకు రెండేళ్లుగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగం నానాటికి పెరిగిపోతూండటంతో యువతలో అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది. ఆర్థిక రంగమూ క్షీణిస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించాలని ఆశపడుతున్న మోదీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. తాజా ప్రకటన అందులో భాగమేనంటున్నారు.

వామ్మో నిరుద్యోగం 
కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బతో 2022 ఏప్రిల్‌ నాటికి దేశంలో నిరుద్యోగిత 8.1 శాతానికి చేరింది. ఉద్యోగార్థుల సంఖ్య 1.3 కోట్లు దాటింది.  ఎంబీఏలు, గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు చిన్నా చితక పనులు చేస్తున్నారు. నైపుణ్యమున్నవాళ్లు విదేశీ బాట పట్టారు. దాంతో 2017–2022 మధ్య దేశంలో ఉత్పాదక రంగ కార్మికుల సంఖ్య 46 నుంచి 40 శాతానికి పడిపోయింది.

దేశంలో 90% ఉపాధి అవకాశాలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో 12.2 కోట్లు, రెండే వేవ్‌లో కోటి మందికి పైగా రోడ్డున పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో ఉద్యోగుల కొరతతో పనులు స్తంభిస్తున్నాయి. 

కత్తి మీద సామే!  
ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ కష్టమేనని నిపుణులంటున్నారు. దీనికి తోడు ఏటా 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నందున 2030 నాటికి 9 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి వస్తుందని మెకెన్సీ గ్లోబల్‌ నివేదిక వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 6 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని ఈ ఏడాది బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించింది.

2005లో 35 శాతమున్న మహిళా ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 21 శాతానికి తగ్గింది. వారికీ ఉద్యోగాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంది. మోదీ ప్రకటన వెనక ఈ కారణాలన్నీ ఉన్నాయంటున్నారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

చదవండి: (Corona Virus: 50 వేలు దాటిన యాక్టివ్‌ కేసుల సంఖ్య) 

మరిన్ని వార్తలు