ఐదు అసెంబ్లీల ఎన్నికలపై ప్రధాని లీకులు

22 Feb, 2021 19:33 IST|Sakshi

డిస్పూర్‌: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీల గడువు ముగుస్తోంది. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను మినీ సమరంగా పేర్కొంటారు. దేశంలోనే కీలకమైన పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై ఇప్పటికే రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఈ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీకులు వదిలారు.

అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఎన్నికలపై కొన్ని సంకేతాలు పంపారు. మార్చి 7వ తేదీన ఐదు అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. ప్రధానమంత్రి సోమవారం అస్సాంలోని డెమాజీ జిల్లా, సిలాపతార్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు. ‘గత ఎన్నికలు 2016 మార్చ్‌ 4వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అయితే ఈసారి మార్చ్‌ 7వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా’ అని ప్రధానమంత్రి నేంద్ర మోదీ తెలిపారు. ‘ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసేలోపు వీలైనంత పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పర్యటిస్తా’ అని ప్రధాని బహిరంగసభలో తెలిపారు. అధికారిక సమాచారం మేరకే ప్రధాని ప్రకటన చేశారని పలు వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ప్రకటనతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాని ప్రకటన మేరకు షెడ్యూల్‌ మార్చ్‌లో విడుదలైతే ఏప్రిల్‌, మేలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టింది. ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగంతో మంతనాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఐదు అసెంబ్లీల నగారా మోగనుంది.

పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో ఎన్నికల ప్రచారం మొదలైంది. ఆయా రాజకీయ పార్టీలు విజయం కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమయ్యాయి. ఇక పుదుచ్చేరిలో ఇప్పటికే ప్రభుత్వం కూలిపోగా.. రెండు, మూడు రోజుల్లో పుదుచ్చేరి ప్రభుత్వ భవితవ్యం తేలనుంది. మూడోసారి అధికారంలోకి రావాలని తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి అధికారంలోకి రావాలని బీజేపీ, పశ్చిమబెంగాల్‌లో అయితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు తీవ్రంగా శ్రమిస్తోంది.

చదవండి: కాంగ్రెస్‌కు భంగపాటు‌: ఏడాదిలో రెండో ప్రభుత్వం

మరిన్ని వార్తలు