రోజంతా తిట్టుకున్నారు.. ఆపై ‘మిల్లెట్‌ లంచ్‌’లో సరదాగా ఇలా..!

20 Dec, 2022 19:32 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ సూచనల మేరకు 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఎంపీలందరికీ పార్లమెంట్‌ ఆవరణలో మంగళవారం మిల్లెట్‌ లంచ్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఒకే డైనింగ్‌ టేబుల్‌పై మిల్లెట్‌ లంచ్‌ చేశారు. ప్రఖ్యాత చెఫ్‌లతో తయారు చేసిన చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను నెతలంతా ఇష్టంగా తిన్నారు. 

ఈ సందర్భంగా మిల్లెట్‌ లంచ్‌పై ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ.‘ 2023 ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్‌ సంవత్సరంగా నిర్వహించబోతున్న తరుణంలో పార్లమెంట్‌లో నిర్వహించిన మిల్లెట్‌ లంచ్‌కు హాజరయ్యాము. పార్టీలకతీతంగా నేతలు హాజరవటం చాలా సంతోషంగా ఉంది.’అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ లంచ్‌లో బజ్రే కా రబ్డీ సూప్‌, రాగి దోస, యుచెల్‌ చట్నీ, కలుహులి, లేహ్‌సన్‌ చట్నీ, చట్నీ పౌడర్‌, జోల్దా రోటీ, గ్రీన్‌ సలడాా  వంటివి ప్రత్యేకంగా నిలిచినట్లు నేతలు పేర్కొన్నారు.

ఆసక్తికరం..
ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన నెలకొంది. రాజస్థాన్‌ అల్వార్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు శునకం, ఎలుకలు అంటూ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ అట్టుడుకింది. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అధికార బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ ఎంత చెప్పినా వినకుండా ఆందోళనకు దిగడంతో కొద్ది సమయంలో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న తర్వాత సాయంత్రం ఈ మిల్లెట్‌ లంచ్‌ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతా సంతోషంతో కలిసి లంచ్‌లో పాల్గొనటం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా

మరిన్ని వార్తలు