నేడే అర్బన్‌ 2.0, అమృత్‌ 2.0

1 Oct, 2021 05:44 IST|Sakshi

నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌– అర్బన్‌ 2.0, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(అమృత్‌) 2.0కు రూపకల్పన చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావ వంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది.

అర్బన్‌ 2.0..
అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్‌ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌–అర్బన్‌ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.

అమృత్‌ 2.0..
దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్‌ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్‌ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు