వీడియో: కర్ణాటక సంప్రదాయ డ్రమ్‌ను హుషారుగా వాయించిన ప్రధాని మోదీ

19 Jan, 2023 16:07 IST|Sakshi

బెంగళూరు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం కర్ణాటకలో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా.. కలబురాగి(గుల్బర్గా)జిల్లాలో ఓ పబ్లిక్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన సంప్రదాయ డ్రమ్‌ వాయించి.. అక్కడి ప్రజల్లో హుషారు నింపారు. 

ప్రధాని మోదీ డ్రమ్స్‌ వాయిస్తున్నంత సేపు.. అక్కడున్న జనాలంతా చప్పట్లు, విజిల్స్‌తో మారుమోగించారు. వేదిక మీద ఉన్న అధికారులు సైతం చప్పట్లతో ప్రధానిని ఎంకరేజ్‌ చేశారు. అయితే ప్రధాని మోదీ ఇలా వాయిద్యాలు వాయించడం కొత్తం కాదు. దేశంలోనే కాదు.. విదేశీ పర్యటనల్లోనూ ఆయన ఇలా సందడి చేశారు గతంలో. 

ఆపై ఆయన ప్రసంగిస్తూ.. తమది అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం కలిసొచ్చే అంశమని, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అంటే డబుల్‌ బెనిఫిట్‌, డబుల్‌ వెల్‌ఫేర్‌ అని, డబుల్‌ ఫాస్ట్‌ పేస్డ్‌ డెవలప్‌మెంట్‌ అని.. ఇందుకు కర్ణాటక మంచి ఉదాహరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారతదేశం అభివృద్ధి 75 సంవత్సరాలు సాగుతోంది. ఇప్పుడు దేశం రాబోయే 25 సంవత్సరాలపై దృష్టి సారించి ముందుకు సాగుతోంది. ఈ 25 సంవత్సరాలు దేశంలోని ప్రతి పౌరునికి అమృత కాలమే!. ఈ కాలంలోనే మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించుకోవాలి అని ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మేనెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈనెలలో ప్రధాని కర్ణాటకలో పర్యటించడం ఇది రెండోసారి. వారం కిందటేనేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ కోసం ఆయన హుబ్బలికి వచ్చారు. ఇక గురువారం.. కలబురాగి జిల్లాలోని కొడెకల్‌లో నేషనల్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుతో పాటు పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులను ప్రారంభించారాయన.   ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ తావార్‌చంద్‌ గెహ్లాత్‌, సీఎం బసవరాజ్‌ బొమ్మై, కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబ, రాష్ట్ర మంత్రులు, నేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారేం కాదు!

మరిన్ని వార్తలు