డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో... యూపీకి ప్రయోజనం

15 Sep, 2021 04:20 IST|Sakshi
అలీగఢ్‌లో ప్రధాని మోదీకి జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం యోగి  

కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే మేలు 

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు  

అలీగఢ్‌లో రాజా ప్రతాప్‌ సింగ్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన

అలీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌లో 2017కి ముందు గూండాలు, మాఫియాలు రాజ్యమేలారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలో పరిస్థితులన్నీ మారిపోయాయని అన్నారు. యూపీలోని అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ స్టేట్‌ యూనివర్సిటీకి ప్రధాని మంగళవారం శంకుస్థాపన చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉండడంతో యూపీ ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్న  యోగి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలంటే అడుగడుగునా అడ్డంకులే ఉండేవని, యోగి సీఎం అయ్యాక సంక్షేమ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు.

రాజా ప్రతాప్‌ సింగ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితాలు ఎలా త్యాగం చేశారో నేటి తరానికి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇంటి భద్రత కోసం వేసే తాళాలకు అలీగఢ్‌ ఎలా ప్రఖ్యాతి వహించిందో, సరిహద్దుల్లో రక్షణ అంటే కూడా అలీగఢ్‌ పేరే ఇక వినిపిస్తుందని మోదీ అన్నారు. అలీగఢ్‌ యూపీకే ఒక రక్షణ హబ్‌గా మారబోతోందని వ్యాఖ్యానించారు. అలీగఢ్‌లో ఏర్పాటు కానున్న  రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని సందర్శించారు. రక్షణ రంగంలో భారత్‌ సంపూర్ణ స్వావలంబన సాధించిందని అన్నారు. ఒకప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే వారిమని, ఇప్పుడు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు.  యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలకి సంబంధించిన పరికరాలన్నీ మేడ్‌ ఇన్‌ ఇండియావేనని ప్రధాని అన్నారు. 

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని! 
జాట్‌ సామాజిక వర్గానికి చెందిన రాజా మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ స్మృత్యర్థం రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు చేయనుండటం ఎన్నికల స్టంటేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్‌ సింగ్‌ పేరుతో లోధా, జరౌలి గ్రామాల్లోని 92 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 395 కాలేజీలు పని చేస్తాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్‌ సామాజిక వర్గం బలంగా ఉంది.  వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతన్నల ఆందోళన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై జాట్లు ఆగ్రహంగా ఉన్నారు.  వారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికే అదే సామాజిక వర్గానికి చెందిన రాజా ప్రతాప్‌ సింగ్‌ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆగమేఘాల మీద ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. 

మరిన్ని వార్తలు