ఆరో వందే భారత్‌ను ప్రారంభించిన మోదీ.. మెట్రోలో ప్రయాణం

11 Dec, 2022 12:35 IST|Sakshi

ముంబై: దేశంలో మరో వందే భారత్‌ రైలు కూత పెట్టింది. జెండా ఊపి రైలును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ల మధ్య సేవలందించనుంది ఈ ట్రైన్‌. నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ.. ఆరో వందే భారత్‌ రైలుకు పచ్చ జెండా ఊపారు.  ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, ప్రయాణికులతో ముచ్చటించారు మోదీ. దేశంలో సేవలు ప్రారంభించిన ఆరో వందే భారత్‌ రైలు ఇది. 

సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. 
నాగ్‌పూర్‌లో రూ.8650 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేస్‌ 1ని ప్రారంభించారు ప్రధాని. అనంతరం ఒక సాధారణ ప్రయాణికుడిలా టికెట్‌ కొనుగోలు చేసి.. ఫ్రీడం పార్క్‌ నుంచి ఖప్రీ స్టేషన్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు.  విద్యార్థులతో పాటు జర్నీ చేస్తూ వారితో ముచ్చటించారు. అనంతరం రూ.6700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో ఫేస్‌ 2కు శంకుస్థాపన చేశారు.

ఆదివారం ఉదయం నాగ్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలు స్వాగతం పలికారు. నాగ్‍పూర్‌ ఎయిమ్స్‌ ప్రారంభోత్సవం, నాగ్‌పూర్‌, అజని రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?

మరిన్ని వార్తలు