వేగవంతమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌: మోదీ

31 May, 2022 07:24 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని తట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శాస్త్రవేత్తలు, వైద్యులు, యువత సహకారంతో ఈ మహమ్మారిని భారత్‌ ఎదుర్కొంది. భారత్‌ ప్రపంచానికి సమస్యగా మారకుండా, కరోనా సమస్యకు సొంతంగా పరిష్కారం చూపిందన్నారు.

ప్రపంచంలోని అనేక దేశాలకు కోవిడ్‌ నివారణ ఔషధాలు, టీకాలను అందజేసిందని తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌ స్కీం ప్రయోజనాలను మోదీ సోమవారం విడుదల చేశారు. పథకం పాస్‌ బుక్కులను, ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఊహించనంతటి అభివృద్ధిని ఎనిమిదేళ్లలోనే భారత్‌ సాధించింది. ప్రపంచ వేదికలపై మన ప్రభావం, పలుకుబడి పెరిగాయి’అన్నారు.

చిన్నారుల రోజువారీ అవసరాల నిమిత్తం నెలనెలా రూ.4 వేల అందజేస్తామని చెప్పారు. వారికి 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలు అందించడంతోపాటు ఆయుష్మాన్‌ కార్డు, సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ సదుపాయాలున్నట్టు చెప్పారు. వృత్తివిద్యా కోర్సులకు, ఉన్నత విద్యకు విద్యారుణాలూ అందజేస్తామని ప్రకటించారు.  పీఎం కేర్స్‌ పథకం కింద విద్యార్థులకు 1 నుంచి 12వ తరగతి పూర్తయ్యేదాకా వారి ఖాతాల్లో నేరుగా స్కాలర్‌షిప్‌ జమవుతుంది. 2022–23కు దేశవ్యాప్తంగా 3,945 మంది చిన్నారులకు రూ.7.89 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు