రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్‌ 12వ విడత నిధుల విడుదల

16 Oct, 2022 10:40 IST|Sakshi

న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా 12వ విడత నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ 2022 సదస్సును అక్టోబర్‌ 17న సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వేదికగానే రైతుల ఖాతాల్లోకి 12వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.16వేల కోట్లు విడుదల చేయనున్నారు మోదీ. రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2వేల చొప్పున జమకానున్నాయి.  

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ 2022 సదస్సుపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్‌ సదస్సు/ ఎగ్జిబిషన్‌ను, 600 ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 300 అంకుర పరిశ్రమలు తమ నవకల్పనలను ప్రదర్శిస్తాయన్నారు. రైతులకు ‘పీఎం సమ్మాన్‌ నిధి’ 12వ విడత కింద ఇప్పటివరకు రూ.2.16 లక్షల కోట్లు విడుదల చేసినట్లవుతుందని తెలిపారు. ‘ఒకే దేశం ఒకే ఎరువు’ ఇతివృత్తంతో భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ, భారత్‌ ఎంఓపీ, భారత్‌ ఎన్‌పీకే బస్తాలను మోదీ విడుదల చేస్తారన్నారు. వీటన్నింటినీ భారత్‌ పేరుతో విడుదల చేయడంవల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.

మరోవైపు.. ఈ వేదికగానే వేలాది మంది రైతులు, అగ్రి స్టార్టప్స్‌, పరిశోధకులు, పాలసీమేకర్స్‌, బ్యాంకర్లతో ప్రధాని మాట్లాడతారని తెలిపారు తోమర్‌. కోటి మందికిపైగా రైతులు వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వెల్లడించారు. అలాగే.. 732 క్రిషి విజ్ఞాన్‌ కేంద్రాలు, 73 ఐసీఏఆర్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, 72 రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 600 పీఎం కిసాన్‌ సెంటర్స్‌, 50వేల పీఏసీఎస్‌లు, 2 లక్షలకుపైగా కమ్యూనిటీ సర్వీస్‌ సెంటర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయన్నారు.

ఇదీ చదవండి: ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్‌ రికార్డు

మరిన్ని వార్తలు