ఒలింపిక్స్‌​ క్రీడల సన్నద్ధతపై మోదీ సమీక్ష

3 Jun, 2021 17:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌​ క్రీడల సన్నద్ధతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. 

ఈ క్రమంలో, క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్​తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక్కో క్రీడాకారుడి ప్రతిభతో మరో వంద మంది స్ఫూర్తిని పొందుతారని అన్నారు. ఒలింపిక్స్​లో పాల్గోనే క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్​ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో దేశమంతా వారివెంటే నిలుస్తుందని అన్నారు.  

టోక్యోలో జరగబోయే ఈ క్రీడల్లో మన దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్​ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. టోక్యో ఒలింపిక్స్​ క్రీడలకు మరో 50 రోజుల గడువు మిగిలి ఉందన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు