రక్షణ రంగంలో సాంకేతికత పెరగాలి

14 Mar, 2022 06:15 IST|Sakshi

భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంతకంతకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌లో భద్రతా సన్నద్ధతపై ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతపై ఆదివారం ఢిల్లీలో కేబినెట్‌ కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. త్రివిధ బలగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను ప్రవేశపెట్టాలని, రక్షణ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా చర్చలు సాగాయని ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

రక్షణ రంగంలో మేకిన్‌ ఇండియా సాధిస్తే మన బలం పెరగడంతో పాటు ఆర్థిక రంగం కూడా పుంజుకుంటుందని సమావేశం ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రధాని మోదీ వివిధ దేశాలు రక్షణ రంగంలో వాడుతున్న టెక్నాలజీ, భారత్‌ పకడ్బందీగా ఎలా ముందుకెళుతోందో వివరించారు. ఖర్కీవ్‌లో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్‌ శేఖరప్ప మృతదేహాన్ని భారత్‌కు తిరిగి తేవడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు