మృతులు 300కు చేరువలో...

4 Jun, 2023 05:06 IST|Sakshi
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో మాట్లాడుతున్న మోదీ

దేశాన్ని కుదిపేసిన ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం

1,175 దాటిన క్షతగాత్రులు

ఘటనా స్థలికి మోదీ, మమత, నవీన్‌

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్‌ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్‌ సమీపంలో మెయిన్‌ ట్రాక్‌ నుంచి లూప్‌ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే.

ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్‌ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్‌ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్‌ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అన్నారు.  

కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్‌ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్‌ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది.  

లోకో పైలట్‌లకు గాయాలు
భువనేశ్వర్‌: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో లోకోపైలట్‌ జీఎన్‌ మహంతి, సహాయ లోకో పైలట్‌ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్‌ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.

మరిన్ని వార్తలు