ప్రాణాంతక వైరస్‌ లంపీ వ్యాధిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. కలిసి పనిచేద్దాం!

13 Sep, 2022 07:07 IST|Sakshi

గ్రేటర్‌ నోయిడా(యూపీ): పశుసంపదను బలితీసుకుంటున్న లంపీ చర్మ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ రైతాంగానికి భరోసా ఇచ్చారు. ప్రాణాంతక వైరస్‌ కారణంగా ప్రబలే లంపీ వ్యాధి పశువుల్లో తీవ్రమైన జ్వరం, చర్మంపై గడ్డలు ఏర్పడి తుదకు ప్రాణాలను హరిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ వ్యాధికారణంగా గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాసహా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పాడి ఆవులు, పశువులు మృత్యువాతపడిన విషయం తెల్సిందే.

సోమవారం గ్రేటర్‌ నోయిడాలో ఇంటర్నేషనల్‌ డైరీ ఫెడరేషన్‌ వరల్డ్‌ డైరీ సమ్మిట్‌ను ప్రారంభించి మోదీ ప్రసంగించారు. ‘ రైతులకు, వారి ఆదాయానికి, పాల ఉత్పత్తికి విఘాతంగా మారిన లంపీ వ్యాధి వ్యాప్తి నిరోధానికి దేశీయంగా వ్యాక్సిన్‌ అందుబాటులోనే ఉంది. మూడేళ్లలో దేశంలోని అన్ని పశువులకు కాళ్లు, నోటి సంబంధ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తాం’ అని మోదీ అన్నారు.

‘‘పశు ఆధార్‌ పేరిట ప్రతీ పాడిజంతువుకు బయోమెట్రిక్‌ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాడి పరిశ్రమ విస్తరణతోపాటు సంతులిత పాడి ఆర్థికవ్యవస్థ సాధ్యమవుతుంది. గోవర్థన్‌ యోజనతో వ్యవసాయ, డెయిరీ రంగంలో కొత్తగా వేయికిపైగా అంకుల సంస్థలు పురుడుపోసుకున్నాయి. మహిళల భాగస్వామ్యం వల్లే డెయిరీ సెక్టార్‌ వృద్ధిబాటలో పయనిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే 44 శాతం వృద్ధితో పాల ఉత్పత్తి నేడు 21 కోట్ల టన్నులకు పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటు (2 శాతం)తో పోలిస్తే భారత్‌లో పాల ఉత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు 6 శాతానికి పెరిగింది. చిన్న రైతుల వల్లే ఇది సాధ్యమైంది’’ అని మోదీ అన్నారు.  

మరిన్ని వార్తలు