మరికొన్ని వారాల్లో వ్యా‍క్సిన్‌ సిద్ధం: మోదీ

4 Dec, 2020 14:22 IST|Sakshi

న్యూఢిల్లీ: మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక్కసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుందని పునరుద్ఘాటించారు. కోవిడ్‌ పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం చవక ధరలో సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే అన్ని దేశాల చూపు భారత్‌ వైపే ఉంది. 

ఇప్పటికే టీకా ధర, పంపిణీ గురించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాబట్టి రాజకీయ పార్టీల అధినేతలందరూ మీ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయండి. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. కాగా తాము రూపొందించిన వ్యాక్సిన్‌ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్‌ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు టీకాను 70 డిగ్రీల సెల్సియస్‌ వద్ద స్టోరేజ్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశం గురించి ఇప్పటికే రాష్ట్రాలతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ టీకాను భద్రపరిచేందుకు వీలుగా కోల్డ్‌స్టోరేజీల వివరాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిగా చేశారు.

అదే విధంగా వాక్సిన్‌ స్టాక్‌ గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ‘‘ప్రస్తుతం సుమారు ఎనిమిది వాక్సిన్లు వివిధ ట్రయల్‌ దశల్లో ఉన్నాయి. భారత్‌లో క్లినికల్‌ పరీక్షలు పూర్తి చేసుకునే దిశగా మూడు కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి రానున్న కొన్ని వారాల్లోనే దేశంలో వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాక్సినేషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతూ మనకు ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి’’ అని శుక్రవారం నాటి భేటీలో మోదీ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో కరోనా వ్యాక్సిన్‌పై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వ్యాధిపై పోరాటం కోసం ప్రతి రోజు ఏపీ ప్రభుత్వం 10.18 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. కరోనాపై పొరాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. కరోనా వాక్సిన్ అందరికీ అందుబాటులో లభించేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని కోరారు. పల్స్ పోలియో తరహాలో భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్నారు. చదవండి: పార్టీ సోషల్‌ మీడియా వలంటీర్లకు గుర్తింపు కార్డులు

దేశంలోనే ఏపీ అత్యధికంగా మిలియన్‌కు 1,91,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిందన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర జనాభాలో 20 శాతం మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఏపీలో కరోనా రికవరీ రేటు 98.42శాతం ఉండగా, యాక్టీవ్ కేసుల సంఖ్య 6742 ఉందన్నారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను, కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో తీర్చిదిద్దేందుకు 17,300 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న వారందరికీ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కోసం 108, 104 అంబులెన్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ  ఆస్పత్రుల  ప్రక్షాళన కోసం  బడ్జెట్లో సింహభాగం  ఆరోగ్య రంగానికి  రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు