రైతుల ఆర్థిక స్థితి మారుతుంది: మోదీ

21 Sep, 2020 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని, తమకు నచ్చిన ధరకు రైతులు ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చని తెలిపారు. అదే విధంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు ఆదివారం రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులు రాష్ట్రపతి సంతకంతో త్వరలోనే చట్టరూపం దాల్చనున్నాయి. (చదవండి: సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే)

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడుతూ.. ‘‘నిన్న రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి. రైతులకు నా శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ రూపురేఖలను మార్చే ఇలాంటి బిల్లుల అవసరం ఎంతగానో ఉంది. రైతులు, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసమే మా ప్రభుత్వం వీటిని తీసుకువచ్చింది. ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేలా తోడ్పడతాయి. రైతులు తమకు నచ్చిన చోట, నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాయి. (చదవండిరైతుల పాలిట రక్షణ కవచాలు)

వీటి ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మరో ముఖ్యవిషయాన్ని నేను స్పష్టం చేయదలచుకున్నాను. మండీలు(వ్యవసాయ మార్కెట్లు)కు ఇవి ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. నిజానికి మా ప్రభుత్వమే దేశ వ్యాప్తంగా మండీల ఆధునికీకరణ చేపట్టి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటోంది. కనీస మద్దతు ధర విధానం కూడా కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు. కాగా ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌(ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్‌-2020, ఫార్మర్స్‌(ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌, ఫార్మ్‌ సర్వీసెస్‌ బిల్‌-2020పై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా