‘మోదీ నాయకత్వంలోనే నవభారత్‌’.. ప్రపంచమంతా ఆ కుతూహలంతో ఉందన్న ప్రధాని మోదీ

25 May, 2023 07:48 IST|Sakshi

ఢిల్లీ: ఇది బుద్ధుడు, గాంధీ లాంటి మహానుభావులు నడయాడిన నేల. శత్రువుల్ని సైతం చేరదీసే తత్వం మనది. అందుకే ‘భారత్‌ అసలు ఏమనుకుంటుందో?’ అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది అని అన్నారు ప్రధాన మంత్రి నరేద్ర మోదీ. గురువారం ఉదయం ఢిల్లీ పాలం(ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) వద్ద బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు.  

మూడు రోజల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నేటి(గురువారం) ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పాలం విమానాశ్రయం(దేశీయ) వద్దకు భారీగా బీజేపీ శ్రేణులు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికాయి. భారీ గజమాలతో మోదీని సత్కరించాయి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు ప్రసంగించారు.

ప్రధాని మోదీ ఏమన్నారంటే.. 
తమిళం మన భాష. ప్రతీ భారతీయుడి భాష. ప్రపంచంలోనే పురాతనమైంది తమిళం. అలాంటిది పాపువా న్యూ గినియాలో టోక్‌ పిసిన్‌ తర్జుమా పుస్తకం ‘తిరుక్కురల్‌’ను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది. నేను నా దేశ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు, నేను ప్రపంచం కళ్ళలోకి చూస్తాను. మీరు దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున ఈ విశ్వాసం వచ్చింది.  

ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్లు మోదీ మీద అభిమానంతో రావట్లేదు.. భారత్‌ మీద ప్రేమతో వస్తున్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌లను ఎందుకు పంచాలో చెప్పాలంటూ కొందరు నిలదీస్తున్నారు. ఇది బుద్ధుడు, గాంధీ నడయాడిన నేల. శత్రువులను సైతం చేరదీసే తత్వం మనది. భారత్‌ అసలు ఏమనుకుంటుందో? అని తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రపంచం ఇప్పుడు ఉంటోంది.

మనదేశ సంస్కృతి,  సంప్రదాయం గురించి మాట్లాడేటప్పుడు, బానిస మనస్తత్వంలో ఎప్పుడూ మునిగిపోవద్దు. ధైర్యంగా మాట్లాడాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచం ఆ గొప్ప విషయాలను వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది. మా పుణ్యక్షేత్రాలపై దాడి ఆమోదయోగ్యం కాదని నేను చెప్పిన సమయంలో.. ప్రపంచం నాతో ఏకీభవిస్తూ వస్తోంది. 

సిడ్నీలో జరిగిన భారతీయ ప్రవాసుల కార్యక్రమానికి.. ఆస్ట్రేలియా ప్రధాని మాత్రమే కాకుండా మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, అధికార పక్షం కూడా హాజరైంది. ఇదే ప్రజాస్వామ్య బలం. వాళ్లంతా మన కమ్యూనిటీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదీ మనకు దక్కిన గౌరవం. 

జేపీ నడ్డా ఏమన్నారంటే..
పాపువా న్యూ గినియా ప్రధాని మీ పాదాలను తాకిన తీరు.. మీకు అక్కడ ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది. మన ప్రధానికి ఇలా స్వాగతం దక్కడంపై ఇక్కడి ప్రజలు గర్వపడుతున్నారు. మీ పాలనా నమూనాను ప్రపంచం మెచ్చుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీ ఆటోగ్రాఫ్ అడిగారు. మీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచం ఎలా చూస్తుందో ఇక్కడే తెలిసిపోతోంది. 

జైశంకర్‌ ఏమన్నారంటే.. 
పాపువా న్యూ గినియా ప్రధాని, మన ప్రధాని మోదీని ‘విశ్వ గురువు’గా భావిస్తున్నానని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని అయితే ఏకంగా మన ప్రధానిని ‘ది బాస్’ అని సంబోధించారు. ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈరోజు ప్రపంచం కొత్త భారతదేశాన్ని చూస్తోంది.
 

మరిన్ని వార్తలు