కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ

5 Dec, 2020 13:12 IST|Sakshi
భారత ప్రధాని నరేంద్ర మోదీ‌ (ఫైల్‌ఫొటో)

కనీస మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు కేంద్రం రెడీ!

సాక్షి, న్యూఢిల్లీ: రైతులతో ప్రభుత్వం చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రైతుల డిమాండ్ల గురించి కేంద్ర మంత్రులు మోదీతో చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాల పట్ల అన్నదాతల అభ్యంతరాలను ప్రస్తావించారు. కాసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను సవరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రైతుల డిమాండ్లకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అన్నదాతలకు భరోసా కల్పించేలా కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

అంతేగాకుండా విద్యుత్‌ బిల్లులపై రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రైతులకు మధ్య ఇప్పటికే నాలుగు దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కేంద్రం నేడు మరోసారి రైతులతో చర్చించేందుకు సిద్ధమైంది. (చదవండి: మరికొన్ని వారాల్లో వ్యా‍క్సిన్‌‌ సిద్ధం: మోదీ)

ఈ విషయం గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రైతులతో భేటీ అయ్యేందుకు షెడ్యూల్‌ రూపొందించుకున్నాం. ప్రభుత్వ నిర్ణయం పట్ల వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. చర్చలు సఫలమై.. ఆందోళనకు స్వస్తి పలుకుతారని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా... కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం సమ్మతం కాదని తేల్చిచెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 8న భారత్‌ బంద్‌ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా