చిన్నారి ప్రాణం నిలిపేందుకు 6 కోట్ల జీఎస్‌టీ రద్దు

12 Feb, 2021 06:03 IST|Sakshi
తీరా కామత్‌

ప్రధాని నరేంద్ర మోదీ ఉదారత్వం 

మోదీ ప్రకటన పట్ల తల్లిదండ్రుల ఆనందం

ముంబై: జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఐదు నెలల చిన్నారి తీరా కామత్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉదారం చూపారు. ఈ చిన్నారికి రూ.16 కోట్ల విలువైన మందులను దిగుమతి చేసుకునేందుకు 6 కోట్ల రూపాయల జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్‌టీ మొత్తాన్ని మోదీ రద్దు చేశారు. ఈ చిన్నారి ఆపరేషన్‌ల కోసం దాతల నుంచి రూ.16 కోట్లను ముంబైలోని కామత్‌ కుటుంబం సేకరించింది.

ఈ పాపాయిని వ్యాధి నుంచి కాపాడేందుకు జన్యుమార్పిడి థెరఫీ చేయాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన జోల్గెన్‌స్మా అనే ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలి. ఖర్చుకి తోడు రూ.6 కోట్ల జీఎస్‌టీ భారం పడుతోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు∙మోదీ చొరవ చూపి జీఎస్‌టీ రద్దు చేశారు.  2021 జనవరిలో కుమార్తె వైద్య పరిస్థితిని మోదీకి పాప తల్లిదండ్రులు చెప్పారు.

మందుల దిగుమతిపై పన్నులన్నింటినీ మినహాయించాలని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు లేఖలు రాశారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు ఈ ఖర్చుని భరించే స్థితిలో లేకపోవడంతో వారు విరాళాల ద్వారా ఈ మొత్తాన్ని దాతల నుంచి సేకరించారు. అందుకే ఈ కేసుని ప్రత్యేక కేసుగా భావించి పన్నులు రద్దుచేయాలని ఫడ్నవీస్‌ కోరారు. లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్‌ పై విధించే అన్ని పన్నులను తీరా విషయంలో రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.

తీరా తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్‌ కామత్‌లు మోదీ ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 14, 2020న ఈ పాప పుట్టింది. పుట్టిన రెండు వారాల తరువాత ఈమెకు ఈ జన్యుపరమైన లోపం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పాలు తాగే సమయంలో ఈ పాప ఊపిరి తీసుకోని పరిస్థితి వస్తుంది. దీన్ని స్పైనల్‌ మస్క్యులర్‌ ఆస్ట్రోఫీస్‌ అంటారు.

మరిన్ని వార్తలు