అందుకే దేశం ఆయన్ని గౌరవించింది.. అద్వానీ బర్త్‌డేనాడు ప్రధాని మోదీ

8 Nov, 2022 12:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో దిగ్గజం, భారతీయ జనతా పార్టీ  కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వానీ(LK Advani) ఇవాళ(మంగళవారం, నవంబర్‌ 8న) 96వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

మంగళవారం ఈ బీజేపీ దిగ్గజ నేత ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై ట్విటర్‌ ద్వారా విషయాన్ని తెలియజేశారు. అద్వానీగారి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. భారతదేశ వృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. ఆయన దూరదృష్టి,  మేధస్సు కారణంగా దేశమంతా ఆయన్ని గౌరవించింది. బీజేపీని నిర్మించడంలో, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అద్వానీ నివాసానికి వెళ్లి కలిసొచ్చారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, మరరో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లలో ఉన్నారు.

బీజేపీ పుట్టుకలో కీలక పాత్ర పోషించారు ఎల్‌కే అద్వానీ. 1927, నవంబర్‌ 8న అద్వానీ కరాచీ(పాక్‌)లో జన్మించారు. ఆరెస్సెస్‌లో చేరిక ద్వారా ఆయన ప్రస్థానం మొదలైంది. రథయాత్ర ద్వారా ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఎన్డీయే హయాంలో 1998-2004 మధ్య ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. 2002 నుంచి వాజ్‌పేయి హయాంలో రెండేళ్లపాటు ఉపప్రధానిగానూ అద్వానీ పని చేశారు.

మరిన్ని వార్తలు