అందరూ వ్యాక్సిన్‌ తీసుకోండి

29 Mar, 2021 04:42 IST|Sakshi

కోవిడ్‌ భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకం

వ్యవసాయ రంగం ఆధునీకరణ అత్యవసరం

75వ మన్‌కీ బాత్‌లో ప్రధానమంత్రి మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై భారత్‌ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో భారత ప్రజలు మొదట్నుంచి కఠినమైన జాగ్రత్తలు పాటిస్తూ, క్రమశిక్షణతో ఉంటూ అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరిగే రేడియో కార్యక్రమం మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రసంగించారు. మన్‌ కీ బాత్‌ 75 భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రోతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి అమృత్‌ ఉత్సవాలు జరుపుకుంటున్న వేశ మన్‌కీ బాత్‌ కూడా 75 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమర యోధులు చేసిన త్యాగాలు పౌరులుగా మన బాధ్యతల్ని గుర్తు చేసి కర్తవ్యోముఖుల్ని చేస్తాయని మోదీ అన్నారు.

ఆ పోరాట స్ఫూర్తి అభినందనీయం
కరోనా వైరస్‌ బట్టబయలైన తొలి రోజుల్లో గత ఏడాది మార్చి 22న విధించిన జనతా కర్ఫ్యూ గురించి మోదీ మన్‌ కీ బాత్‌లో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో లాక్‌డౌన్‌ వంటివి కొత్త అయినప్పటికీ ప్రజలంతా సహకరించి దీపాలు వెలిగించి, పళ్లేలు మోగించి ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది మనసుల్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. ప్రజా మద్దతుతో ఏడాదిగా వైద్య సిబ్బంది అలుపెరుగకుండా కరోనాపై యుద్ధం చేస్తున్నారని , ప్రతీ పౌరుడి ప్రాణాలు కాపాడడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. గత ఏడాది అసలు వ్యాక్సిన్‌ వస్తుందో, రాదోనన్న సందేహాలు ఉండేవని, అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన దేశంగా భారత్‌ నిలవడం గర్వ కారణమని అన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న మోదీ 100 ఏళ్లు పైబడిన వాళ్లు వ్యాక్సిన్‌ తీసుకోవడం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కి చెందిన 109 ఏళ్ల అమ్మ రామ్‌ దులాయి, ఢిల్లీలో 107 ఏళ్ల కేవల్‌ కృష్ణ, హైదరాబాద్‌కి చెందిన వందేళ్ల వయసున్న జై చౌదరి వంటివారు వ్యాక్సిన్‌లు తీసుకున్నారని, కరోనాపై పోరాటంలో విజయం సాధించాలంటే అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రధాని పిలుపు,నిచ్చారు.

విజయవాడ వాసి ఆదర్శం
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ పదకండ్ల వాహనాల తుక్కు నుంచి శిల్పాలు సృష్టిస్తున్నారు. అలా సృష్టించిన భారీ శిల్పాలు పబ్లిక్‌ పార్కులో ఏర్పాటు చేయగా ప్రజలు వాటిని ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడంలో ఇదో వినూత్న ప్రయోగం. ఇందుకు నా అభినందనలు. ఇలాంటి కృషిలో పాల్గొనేందుకు మరింత మంది ముందుకురావాలి. అందరూ సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండండి. కరోనా నినాదాన్ని మరచిపోవద్దు’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి
సాగు రంగం అత్యవసరంగా ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎంతో సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవసాయ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు రావాలన్నా, రైతుల ఆదాయం పెరగాలన్నా ఆ రంగంలో వినూత్న పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. సంప్రదాయ పద్ధతుల్ని అనుసరిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కొత్త ఆవిష్కరణలు జరగాలి’అని ప్రధాని అన్నారు. కేంద్రం గత ఏడాది తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో వందలాది మంది రైతులు నవంబర్‌ నుంచి చేస్తున్న ఉద్యమం నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగు చట్టాల ద్వారా వ్యవసాయ రంగంలోకి కొత్తగా పెట్టుబడులు, ఆధునిక విధానాలు వస్తాయని, ఒకే దేశం ఒకే మార్కెట్‌ కారణంగా రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం ఎప్పట్నుంచో చెబుతూ వస్తోంది.

మరిన్ని వార్తలు