ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే: ప్రధాని మోదీ

19 Oct, 2022 02:05 IST|Sakshi

ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు 

సురక్షిత ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి బాధ్యతన్న ప్రదాని 

ఢిల్లీలో 90వ ఇంటర్‌పోల్‌ సదస్సు

పాక్‌తో పాటు మొత్తం 195 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు

పాతికేళ్ల తర్వాత ఢిల్లీలో జరుగుతున్న సదస్సు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అవినీతిపరులు, డ్రగ్‌ స్మగ్లర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి స్థావరాలు ఎక్కడున్నా సరే, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇందుకు కలసికట్టుగా కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రపంచం అంతర్జాతీయ సమాజపు సమష్టి బాధ్యత అన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు.

‘స్థానిక సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం’ అన్నదే భారత నినాదమన్నారు. ‘‘సానుకూల శక్తులన్నీ పరస్పరం సహకరించుకుంటే దుష్టశక్తులు, నేరగాళ్ల పీచమణచవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్‌పోల్‌ 90వ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఢిల్లీలో మోదీ ప్రారంభించారు. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్‌ తరఫున ఆ దేశ ఫెరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌ మొహసిన్‌ బట్‌ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడు అహ్మద్‌ నాజర్‌ అల్‌రైసీ, సెక్రెటరీ జనరల్‌ ఉర్గన్‌ స్టాక్‌ వేదిక వద్ద మోదీకి స్వాగతం పలికారు.

సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈ దుష్టశక్తుల వేగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా వాటిని మొత్తం మానవత్వంపై దాడిగానే చూడాలి. ఎందుకంటే ఇవి భావి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి ముప్పులను ఎదుర్కొనేందుకు స్థానిక స్పందనలు సరిపోవు’’ అని స్పష్టం చేశారు. అందుకే వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరమన్నారు. సదస్సుకు గుర్తుగా 100 రూపాయల నాణాన్ని, పోస్టల్‌ స్టాంపును మోదీ విడుదల చేశారు. ఇంటర్‌పోల్‌ సదస్సు పాతికేళ్ల తర్వాత భారత్‌లో జరుగుతోంది. 

ఉగ్రవాదం తీరు మారింది... 
పొరుగు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్‌ దశాబ్దాలుగా పోరాడుతోందని మోదీ గుర్తు చేశారు. ‘‘ఉగ్రవాద భూతాన్ని మిగతా ప్రపంచం గుర్తించడానికి చాలాకాలం ముందు నుంచే మేం దానితో పోరాడుతూ వస్తున్నాం. భద్రత, రక్షణ కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పోరులో వేలాదిమంది వీరులను కోల్పోయాం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదం ఆన్‌లైన్‌ బాట కూడా పట్టిందన్న వాస్తవాలను గుర్తించాలన్నారు. ‘‘ఇప్పుడు ఎక్కడో మారుమూల నుంచి ఒక్క బటన్‌ నొక్కడం ద్వారా భారీ పేలుడు సృష్టించవచ్చు. తద్వారా ఈ దుష్టశక్తులు వ్యవస్థలనే తమ ముందు సాగిలపడేలా చేసుకునే పరిస్థితి నెలకొంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని ఎదుర్కొనడానికి దేశాలు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలవని అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా పటిష్ట వ్యూహాల ద్వారా  సైబర్‌ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఆ దిశగా తక్షణం విధానాలు రూపొందాలని సూచించారు. పోలీసు, చట్టపరమైన సంస్థలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు మార్గాలు కనిపెట్టాలని సూచించారు. ‘‘ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్‌ సేవలను కాపాడుకునే యంత్రాంగం, సాంకేతిక, నిఘా సమాచారాల త్వరితగత మార్పిడి తదితరాలను ఆధునీకరించుకోవాలి. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల్లో పౌరుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇలా దోచిన సొమ్ము అంతిమంతా ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారుతోంది. యువత జీవితాలను డ్రగ్స్‌ సమూలంగా నాశనం చేస్తోంది’’ అని మోదీ అన్నారు.

రెడ్‌ కార్నర్‌ నోటీసుల్లో వేగం పెరగాలి
పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు వీలు కల్పించే రెడ్‌ కార్నర్‌ నోటీసుల జారీలో వేగం మరింత పెరగాల్సి ఉందని ఇంటర్‌పోల్‌కు ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుతం భారత్‌ తరఫున 780 రెడ్‌ కార్నర్‌ నోటీసులున్నాయని గుర్తు చేశారు. వీటిలో 205 పలు నేరాల్లో సీబీఐ జాబితాలో వాంటెడ్‌గా ఉన్న నేరగాళ్లకు సంబంధించినవని ఆయన చెప్పారు. నేరగాళ్లు ఇంటర్‌పోల్‌ సభ్య దేశాల్లో ఎక్కడున్నా అరెస్టు చేసేందుకు, వెనక్కు రప్పించేందుకు రెడ్‌ కార్నర్‌ నోటీసు వీలు కల్పిస్తుంది. భారత్‌ జారీ చేసిన నోటీసుల్లో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతని సహాయకుడు చోటా షకీల్, ఉగ్రవాదులు మసూద్‌ అజర్, హఫీజ్‌ సయీద్‌తో పాటు ఆర్థిక నేరగాళ్లు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ తదితరులున్నారు. రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ అంతర్జాతీయ అరెస్టు వారెంటు కాదని, నేరగాళ్లను అరెస్టు చేసి తీరాలంటూ సభ్య దేశాలను ఇంటర్‌పోల్‌ ఒత్తిడి చేయలేదని సంస్థ ప్రధాన కార్యదర్శి ఉర్గన్‌ సోమవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. 

దావూద్‌పై పాక్‌ మౌనం 
అండర్‌ వరల్డ్‌ డాన్, భారత్‌లో విధ్వంసం సృష్టించి పరారీలో ఉన్న ఇతర ఉగ్రవాదుల ఉనికిపై పాక్‌ మరోసారి మౌనం వహించింది. దావూద్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఎక్కడున్నారన్న మీడియా ప్రశ్నకు ఇంటర్‌పోల్‌ సదస్సులో పాల్గొంటున్న పాక్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) చీఫ్‌ మొహసిన్‌ బట్‌ బదులివ్వలేదు. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆయన సరిగ్గా సదస్సు మొదలయ్యే సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చారు. అయినా మోదీ ప్రసంగం పూర్తవగానే మీడియా అంతా బట్‌ను చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించింది. వాటికి బదులివ్వకుండానే ఆయన వెళ్లిపోయారు.   

మరిన్ని వార్తలు