జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

20 Oct, 2020 14:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు భారత పౌరులతో ఓ సందేశం పంచుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘‘ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నాను. దయచేసి మీరంతా ఇందుకు సిద్ధంగా ఉండగలరు’’అని విజ్ఞప్తి చేశారు. (చదవండి: అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు)

అయితే తాను ఏ అంశం గురించి మాట్లాడాతానన్న విషయం స్పష్టంగా తెలపలేదు. కాగా దేశంలో రోజురోజుకీ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో, దసరా సహా ఇతర పండుగలు సమీపిస్తున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధాని మోదీ సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక కోవిడ్‌-19 వ్యాప్తి, మార్చి 24నాటి జనతా కర్ఫ్యూ మొదలు, వివిధ దశల్లోని అన్‌లాక్‌ ప్రక్రియ నేపథ్యంలో ప్రధాని ఇప్పటిదాకా ఆరుసార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో భారత్‌లో 46,791 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌ బాధితుల సంఖ్య 75,97,064కు చేరుకుంది. కరోనా సోకిన వారిలో మంగళవారం నాటికి 587 మంది మృతి చెందడంతో, కోవిడ్‌ మరణాల సంఖ్య 1,15,197 కు చేరింది.

మరిన్ని వార్తలు