అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం

29 Nov, 2021 05:53 IST|Sakshi

మన్‌ కీబాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ ఒక్కరూ కోవిడ్‌ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదన్న ఆయన వ్యక్తిగత స్థాయిలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఆకాశవాణి మన్‌ కీ బాత్‌ 83వ సంచికలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తనకు అధికారం అక్కర్లేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ లబ్ధిదారుడు ఒకరు మోదీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పగా ప్రధాన సేవకుడిగా దేశ ప్రజలందరికీ సేవ చేయడమే తన కర్తవ్యమని అన్నారు.

‘‘వాస్తవానికి నేను ఇప్పుడు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. ప్రజా సేవలో ఉండాలన్నదే నా లక్ష్యం. ఒక ప్రధానమంత్రిగా నేను చెలాయిస్తున్నది అధికారం కాదు. ఇదంతా ప్రజాసేవే’’ అని బదులిచ్చారు.  ప్రస్తుతం నడుస్తున్నది స్టార్టప్‌ల యుగమని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో స్టార్టప్‌ పరిశ్రమ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో 100 కోట్ల డాలర్ల విలువను కలిగిఉన్న స్టార్టప్‌లు ప్రస్తుతం 70కి పైగా ఉన్నాయని వెల్లడించారు. దేశంలోని పల్లెల్లో యువత కూడా స్టార్టప్‌లు ఏర్పాటు చేసి   అంతర్జాతీయ సమస్యలకి పరి ష్కార మార్గాలు చూపిస్తున్నారని మోదీ అన్నా రు. కరోనాతో ప్రపంచ దేశాలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తల్లడిల్లుతూ ఉంటే మన స్టార్టప్‌ రంగం ఎంతో ఎత్తుకి ఎదిగిందని చెప్పారు.  

1971 యుద్ధానికి గోల్డెన్‌ జూబ్లీ  
డిసెంబర్‌ మాసం వచ్చిందంటే తనకి వీర సైనికులు గుర్తుకు వస్తారని ప్రధాని అన్నారు. నేవీ, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డేని ఇప్పటికే జరుపుకున్నామని 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజేతలుగా నిలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వీర సైనికుల్ని కన్న తల్లులకు మోదీ జోహార్లు అర్పించారు. 

మరిన్ని వార్తలు