అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు

20 Oct, 2020 04:46 IST|Sakshi

ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడమే లక్ష్యం

మైసూర్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ

మైసూర్‌: ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం మైసూర్‌ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. గత 7 నెలలుగా సంస్కరణల్లో వేగం పెరగడాన్ని మీరు గమనించే ఉంటారని అన్నారు.

వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు ఊపందుకున్నాయని, ఈ ప్రయత్నమంతా దేశ ప్రగతి కోసమేనని ఉద్ఘాటించారు. కోట్లాది మంది యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. మన పునాదులను పటిష్టంగా మార్చుకుంటేనే ఈ దశాబ్దం భారతదేశ దశాబ్దంగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అమలవుతున్న సంస్కరణలు గతంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదో ఒక రంగానికే పరిమితం అయ్యేవని, ఇతర రంగాలను పక్కన పెట్టేవారని చెప్పారు. ఇండియాలో గత ఆరేళ్లుగా బహుళ రంగాల్లో బహుళ సంస్కరణలు అమలయ్యాయని వివరించారు.

ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్‌
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గ్రాండ్‌ చాలెంజెస్‌ వార్షిక సమావేశంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు. ఆరోగ్య రక్షణ విషయంలో ఇండియా ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్‌ అనుభవం, పరిశోధనల్లో నైపుణ్యాలే ఇందుకు కారణమని వివరించారు. వైద్య రంగంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం టీకాల్లో 60 శాతానికిపైగా టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.  ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే చాలెంజెస్‌ లక్ష్యం.

మరిన్ని వార్తలు