సాగు చట్టాల ప్రయోజనాలు ప్రచారం చేయండి

22 Feb, 2021 04:07 IST|Sakshi

బీజేపీ ఆఫీస్‌ బేరర్ల భేటీలో ప్రధాని మోదీ

ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలతో రాజకీయ తీర్మానం ఆమోదం

న్యూఢిల్లీ: ‘దేశమే ప్రథమం’ అన్న భావన స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. దేశం కోసం, దేశాభివృద్ధి కోసం పని చేయడమే పార్టీ కార్యకర్తల లక్ష్యం కావాలన్నారు. పార్టీ మౌలిక సూత్రం ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’ భావనేనని వివరించారు. ఈ సూత్రం అధారంగానే ప్రభుత్వం జీఎస్టీ సహా పలు  సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ‘అధికారం సాధించడం మన ఉద్దేశ్యం కాకూడదు.. దేశాభివృద్ధి కోసం ప్రజాసేవ చేయడమే మన లక్ష్యం కావాలి’ అని వివరించారు.

పార్టీ కొత్త ఆఫీస్‌ బేరర్ల తొలి సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ఆదివారం ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చినందుకు, కోవిడ్‌–19 నియంత్రణ దిశగా సమర్ధవంతమైన నాయకత్వం అందించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలను, గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలను ఎదుర్కొన్న తీరును కూడా తీర్మానంలో ప్రశంసించారు. ‘రైతు ప్రయోజనాలు కేంద్రంగా ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకువచ్చింది.

వారి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించడం, వారి ఆదాయం రెట్టింపు కావడం, తమ ఉత్పత్తులను నచ్చినచోట అమ్ముకునే వెసులుబాటు వారికి లభించడం.. అనే లక్ష్యాల సాధన కోసం ఈ చట్టాలు రూపొందాయి’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంలో పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల సమయంలో వెనక్కు తగ్గకుండా, అదే సమయంలో, అనవసరంగా దూకుడుగా వెళ్లకుండా, సంయమనంతో వ్యవహరించి, సానుకూల పరిష్కారం సాధించారని మోదీపై ప్రశంసలు కురిపించింది. సరిహద్దుల్లో పొరుగుదేశాల విస్తరణ వాదాన్ని భారత్‌ సహించబోదని, ఈ విషయాన్ని మోదీ నాయకత్వంలో భారత్‌ పలుమార్లు రుజువు చేసిందని వివరించింది. మోదీ నాయకత్వంలో భారతదేశం స్పష్టమైన విధానంతో బలమైన దేశంగా రూపుదిద్దుకుందని పేర్కొంది.

కోవిడ్‌–19పై పోరులో భారత్‌ను విజయవంతమైన దేశంగా నిలిపారని ప్రశంసించింది. సాగు చట్టాల విషయంలో కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ తీర్మానం పేర్కొంది. నూతన విద్యా విధానం, కార్మిక సంస్కరణలు సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానంలో ప్రశంసించారు. పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేయాలని పార్టీ శ్రేణులను కోరింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్‌ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై, ఆత్మనిర్భర్‌ భారత్‌పై, సాగు చట్టాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ వెల్లడించారు.  సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు