టాప్‌ గేర్‌లో మౌలికాభివృద్ధి

5 Mar, 2023 04:20 IST|Sakshi

అప్పుడే 2047కల్లా సంపన్న భారత్‌

బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో మోదీ

న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్‌ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌: ఇంప్రూవింగ్‌ లాజిస్టిక్‌ ఎఫీషియెన్సీ విత్‌ పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌’ అనే అంశంపై వర్చువల్‌గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి.

మౌలికాభివృద్ధి టాప్‌గేర్‌లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్‌ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం.

ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు.

రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం
‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్‌పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు.

ప్రగతి పథంలో భారత్‌
బిల్‌గేట్స్‌ ప్రశంసల వర్షం
ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్‌ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్‌ గేట్స్‌ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్‌ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు తయారుచేసే సత్తాను భారత్‌ సాధించడం గొప్పవిషయం. కోవిడ్‌ విపత్తు కాలంలో కోవిడ్‌ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్‌ కాపాడగలిగింది.

పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్‌లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్‌గేట్స్‌ ట్వీట్‌చేశారు. ‘కోవిడ్‌ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్‌ అత్యవసర డిజిటల్‌ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది.

16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్‌ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్‌ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్‌కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్‌ అన్నారు.

మరిన్ని వార్తలు