ఆందోళన ఆపండి.. రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

9 Feb, 2021 04:00 IST|Sakshi

కొత్త వ్యవసాయ చట్టాలకు ఒక అవకాశం ఇవ్వండి

దేశంలో విదేశీ విధ్వంసకర సిద్ధాంతం ఆవిర్భవించింది

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇకనైనా విరమించాలని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళనలో భాగస్వాములైన సిక్కు రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. మన రైతులను మనమే కించపర్చుకోవడం దేశానికి ఏమాత్రం మంచి చేయదని పేర్కొన్నారు. కొత్త చట్టాలను కొందరు రాజకీయ అంశంగా మార్చేశారని విమర్శించారు.

రైతుల ఆందోళన వెనుక ఉన్న అసలైన కారణాలపై ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరో నిర్వచనం ఇచ్చారు. విదేశీ విధ్వంసకర సిద్ధాంతం(ఫారిన్‌ డిస్ట్రక్టివ్‌ ఐడియాలజీ) అనే కొత్త ఎఫ్‌డీఐ దేశంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..

వారంతా ఆందోళన్‌ జీవులు
‘‘దేశంలో ఆందోళన్‌ జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సిక్కులను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు అని సంబోధించడం తగదు. సిక్కుల  సేవలు దేశానికి గర్వకారణం. పంజాబ్‌లో ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. దేశ విభజన వల్ల పంజాబ్‌ తీవ్రంగా నష్టపోయింది. 1984లో జరిగిన అల్లర్లలో సిక్కులు బాధితులయ్యారు.  

సంస్కరణలతో తోడ్పాటు
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ), మండీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలుగదు. ఈ చట్టాలతో మండీలు మరింత ఆధునికంగా మారుతాయి. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కచ్చితంగా కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నా. దేశంలో 80 కోట్ల మందికి రేషన్‌ సరుకులు ఎప్పటిలాగే అందుతాయి. దయచేసి తప్పుడు ప్రచారం సాగించకండి.  కొత్త వ్యవసాయ చట్టాలతో వారు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకొనే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా మంచి ధర పొందుతారు.   పంటల సేకరణ విధానంలో సంస్కరణలు అవసరమని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ చెప్పారు.

రైతన్నలు కొత్త చట్టాలను అర్థం చేసుకోవాలి. రైతులు ఆందోళన ఆపేయాలి. చర్చల కోసం అన్ని ద్వారాలు తెరుద్దాం.  చర్చల కోసం మిమ్మల్ని మరోసారి ఈ సభ నుంచే ఆహ్వానిస్తున్నా. కొత్త సాగు చట్టాలకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ఆందోళనకారులు ఒక అవకాశం ఇవ్వాలి.  రైతులకు మేలు చేస్తాయో లేదో చూడాలి. లోపాలుంటే తొలగించడానికి సిద్ధం. కశ్మీర్‌లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌  కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషకరం. దీన్ని కాంగ్రెస్‌ నాయకులు ‘జి–23 సలహా’గా చూడొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు.

తేదీ, సమయం మీరే నిర్ణయించండి: సంయుక్త కిసాన్‌ మోర్చా
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంయుక్త కిసాన్‌ మోర్చా సీనియర్‌ సభ్యుడు శివ్‌కుమార్‌ కక్కా సోమవారం ప్రకటించారు. చర్చల తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించండి అని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆందోళన జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చిందన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆందోళనకు ముఖ్యమైన పాత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలను తాము ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పారు. ప్రభుత్వం పిలిచినప్పుడల్లా తాము వెళ్లామని, కేంద్ర మంత్రులతో చర్చించామని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు చెప్పింది. అలాంటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరం ఏమిటి?’’ అని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్‌ ప్రశ్నించారు. చర్చలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం రావాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రహన్‌) పంజాబ్‌ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్‌ సింగ్‌ విమర్శించారు.  

ఆకలితో వ్యాపారమా?
దేశంలో ఆకలితో వ్యాపారం సాగించాలనుకుంటే సహించబోమని  భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆందోళన విరమించాలన్న ప్రధానమంత్రి వినతిపై రాకేశ్‌ తికాయత్‌ సోమవారం ప్రతిస్పందించారు. ‘‘దేశంలో ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆకలి పెరిగితే పంటల ధరలు పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమికొట్టాలి’’ అని అన్నారు.  ఎంఎస్పీ ఉండదని రైతులు కూడా చెప్పడం లేదని, దానికి చట్టబద్ధత కావాలని మాత్రమే ఆశిస్తున్నారని గుర్తుచేశారు.  మూడు సాగు చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీ కోసం కొత్త చట్టం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. రైతుల పోరాటం రాజకీయ ప్రేరేపితం అన్న  మోదీ వ్యాఖ్యలను తికాయత్‌ తప్పుపట్టారు. రైతుల్లో కులం, మతం ఆధారంగా చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.  

సింఘు వద్ద తాత్కాలిక స్కూల్‌
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాల దాదాపు 15 రోజుల తర్వాత పునఃప్రారంభమైంది. పంజాబ్‌లోని ఆనంద్‌ సాహిబ్‌కు చెందిన రైతులు ఈ పాఠశాలను డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతుల పిల్లలు చదువుకునేందుకు ఈ స్కూల్‌ను ఒక టెంట్‌లో నెలకొల్పారు. జనవరి 24న ఈ స్కూల్‌ను మూసివేశారు. ఫిబ్రవరి 5న మళ్లీ తెరిచారు. 1 నుంచి 7వ తరగతి వరకు  బోధిస్తున్నారు.

మరిన్ని వార్తలు