టీకాపై సంకోచం వీడండి

28 Jun, 2021 04:43 IST|Sakshi

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ పిలుపు

వందేళ్లు సమీపిస్తున్న మా అమ్మ వ్యాక్సిన్‌ తీసుకున్నారు

సైన్స్‌ను, సైంటిస్టులను నమ్మండి.. పుకార్లను కాదు  

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు జాగ్రత్తలు కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా టీకా విషయంలో సంకోచం వీడాలని సూచించారు. అర్హులందరూ సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకోవాలని కోరారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కొన్నివర్గాల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బేతుల్‌ జిల్లాలోని గిరిజన గ్రామం దులారియా వాసులతో ప్రధాని మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో సందేహాలు, భయాందోళనలను గ్రామస్తులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. తాను, దాదాపు వందేళ్ల వయసున్న తన తల్లి కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారని మోదీ గుర్తుచేశారు. విజ్ఞాన శాస్త్రాన్ని, పరిశోధకులను విశ్వసించాలని, పుకార్లను నమ్మొద్దని అన్నారు.  మారు వేషాలు వేస్తూ ప్రజలను ఏమార్చడంలో కరోనా వైరస్‌ దిట్ట అని ప్రధాని  వ్యాఖ్యానించారు.

అదే అసలైన నివాళి  
ప్రజారోగ్య సంరక్షణలో వైద్యుల పాత్ర మరువలేనిదని ప్రధానమంత్రి  కొనియాడారు. జూలై 1న ‘నేషనల్‌ డాక్టర్స్‌ డే’జరుపుకోనున్న నేపథ్యంలో వారి సేవలను మోదీ ప్రశంసించారు. ఈసారి జాతీయ వైద్యుల దినం మనకెంతో ప్రత్యేకమని చెప్పారు. కరోనా బారినపడి కన్నుమూసిన ప్రభుత్వ కార్యదర్శి గురుప్రసాద్‌ మొహాపాత్రకు మోదీ నివాళులర్పించారు. ఒకవైపు కరోనాతో బాధపడుతూనే మరోవైపు ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి ఆయన కృషి చేశారని చెప్పారు.  గురుప్రసాద్‌ లాంటివాళ్లు ఎంతోమంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించడం, టీకా వేయించుకోవడమే వారికి మనం అర్పించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. దేశంలో వర్షాకాలం ప్రారంభమయ్యిందని, ప్రజలు జల సంరక్షణకు నడుం బిగించాలని మోదీ ఉద్ఘాటించారు.

మరిన్ని వార్తలు