సొంత కారులేదు.. అప్పులూ లేవు

16 Oct, 2020 04:02 IST|Sakshi

మోదీ ఆస్తులు రూ. 2.85 కోట్లు

ఆస్తుల వివరాల వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సగటు వేతన జీవిలా తనకు వచ్చే వేతనాన్ని బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో భద్రంగా దాచుకుంటున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఆయన ఎక్కువగా తనకి వచ్చే వేతనాన్ని నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ), జీవిత బీమా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల రూపంలో ఉంచుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన ఆదాయంలో రూ.36.53 లక్షలు పెరుగుదల కనిపించింది. మోదీ తాజాగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.2.49 కోట్ల చరాస్తులుంటే ఏడాదిలో 26.26% పెరుగుదల కనిపించింది.  

► మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30% ఆయన వేతనంలోంచి కట్‌ అవుతోంది.  
► ప్రధాని సేవింగ్స్‌ అకౌంట్‌లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి.  
► గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ అకౌంట్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి
► నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు.  
► నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది.  
► గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది.  
► ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు.

అమిత్‌ షా ఆస్తులు తగ్గాయ్‌ !
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆస్తుల విలువ గత ఏడాదితో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. షేర్‌ మార్కెట్‌లో డబ్బులు ఉంచడంతో ఆయనకి ఉన్న చరాస్తుల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది అమిత్‌ షా వద్ద రూ. 32.3 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ. 28.63 కోట్లకి తగ్గిపోయాయి. ఇక రూ.13.56 కోట్ల విలువైన స్థిరాస్తులు షా పేరు మీద ఉన్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. షా బ్యాంకు ఖాతాలో రూ.1.04 కోట్లు ఉంటే ఆయన దగ్గర నగదు రూపంలో రూ.15,814 ఉన్నాయి. రూ.44.47 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు