ప్రధాని మోదీ సమక్షంలో ఒక్కటైన 551 జంటలు

6 Nov, 2022 21:13 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో 551 జంటలు ఒక్కటయ్యాయి. గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోదీ.. సామూహిక వివాహ వేడుకకు హాజరయ్యారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి తన ఆశీస్సులు అందించారు మోదీ. ఈ సందర్భంగా బంధువుల ఒత్తిడితో ప్రత్యేకంగా ఇంటి వద్ద విందు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని నూతన వధూవరులను కోరారు మోదీ. అందుకు ఖర్చు చేసే డబ్బులను తమ పిల్లల కోసం అ‍ట్టిపెట్టుకోవాలని సూచించారు. కొత్త జంటలతో కలిసి ఫోటోలు దిగారు మోదీ. వారితో కాసేపు ముచ్చటించారు. 

భవనగర్‌ సిటీలోని జవహార్‌ మైదానంలో ‘పాపా ని పారీ లగ్నోత్సవం 2022’ పేరుతో సామూహిక వివాహాలు జరిపించారు. ఈ మాస్‌ వెడ్డింగ్‌ వేడుకల్లో 551 జంటలు ఒక్కటయ్యాయి. తండ్రిని కోల్పోయిన 551 మంది యువతులకు ఈ సామూహిక వివాహ వేదికగా పెళ్లిళ్లు జరిపించారు నిర్వాహకులు.

డిసెంబర్‌లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వరాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఉదయం వల్షాద్‌ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశలో డిసెంబర్‌ 1న 89, రెండో దశలో డిసెంబర్‌ 5న 93 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఇదీ చదవండి: తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్‌ 

మరిన్ని వార్తలు