ఈశాన్యం అభివృద్ధికి ఆకాశమే హద్దు

19 Dec, 2022 05:43 IST|Sakshi
ఈశాన్య కౌన్సిల్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ

ప్రతిబంధకాలన్నింటికీ రెడ్‌కార్డ్‌ 

‘విభజన’ ఆటలు     సాగనివ్వడం లేదు

ఈశాన్య కౌన్సిల్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

షిల్లాంగ్‌/అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ ఎనిమిదేళ్లలో తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్‌ఈస్ట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఈసీ) గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ‘‘ఎనిమిదేళ్లలో ఈశాన్యం నుంచి విమాన సేవలు మెరుగవడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగింది. విమానాశ్రయాలు 9 నుంచి 16కు, విమానాల సంఖ్య 900 నుంచి 1,900కు పెరిగాయి. రైల్వేమ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలు కూడా చేరాయన్నారు. జాతీయ రహదారులు 50 శాతం పెరిగిందన్నారు. జలమార్గాలను విస్తరించే పనులు జరుగుతున్నాయి’’ అన్నారు.

ఈశాన్యమే కేంద్రస్థానం  
ఆగ్నేయాసియాకు ఈశాన్య రాష్ట్రాలే మన ముఖద్వారమని మోదీ పేర్కొన్నారు. మొత్తం ఆగ్నేయాసియా అభివృద్ధికి ఈశాన్యం కేంద్రస్థానంగా మారగలదని చెప్పారు. ఆ దిశగా ఇండియన్‌–మయన్మార్, థాయ్‌లాండ్‌ ప్రధాన రహదారి, అగర్తలా–అఖురా రైల్వే ప్రాజెక్టు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈశాన్యంలో ఎన్నో శాంతి ఒప్పందాలు, అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందాలు కుదిరాయని గుర్తుచేశారు. ఫలితంగా తీవ్రవాద సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం 1971లో పార్లమెంట్‌ చట్టం ద్వారా నార్త్‌ఈస్ట్‌ కౌన్సిల్‌ ఏర్పాటయ్యింది. 1972 నవంబర్‌ 7 నుంచి అమల్లోకి వచ్చింది.  

త్రిపుర బహుముఖ అభివృద్ధే లక్ష్యం  
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అవిశ్రాంతంగా కష్టపడి పని చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన 2 లక్షకుపైగా నూతన గృహాలను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. త్రిపుర బహుముఖ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ రోజు 2 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని, మెజారిటీ లబ్ధిదారులు మహిళలేనని చెప్పారు. గత ఐదేళ్లుగా పరిశుభ్రత అనేది ఒక ప్రజాఉద్యమంగా మారిందని, త్రిపుర అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా అవతరించిందని ప్రశంసించారు. త్రిపురలో అనుసంధానం, మౌలిక ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘త్రిపుర గతంలో ఘర్షణలకు మారుపేరుగా ఉండేది. 2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి, అనుసంధానానికి, శుభ్రతకు పర్యాయపదంగా మారింది’’ అన్నారు. ఈశాన్య భారత్‌ను, బంగ్లాదేశ్‌ను అనుసంధానించే 15 కిలోమీటర్ల అగర్తలా–అఖౌరా రైల్వేప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుందన్నారు.      

ఆ రాష్ట్రాలు.. అష్టలక్ష్ములు  
ఈశాన్య ప్రాంతాల ప్రగతికి ప్రతిబంధకంగా మారిన అవినీతి, వివక్ష, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలకు రెడ్‌కార్డ్‌ చూపించామని మోదీ అన్నారు. ‘‘నార్త్‌ఈస్ట్‌ను విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మేమొచ్చాక అలాంటి ఆటలు సాగనివ్వడం లేదు’’ అన్నారు. ఆదివారం ఉదయం షిల్లాంగ్‌లో ఆయన కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. గత 50 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో ఎన్‌ఈసీ పోషించిన పాత్రను వివరిస్తూ రచించిన ‘గోల్డెన్‌ ఫూట్‌ప్రింట్స్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈశాన్యం అభివృద్ధి విషయంలో ఎన్‌ఈసీ అందించిన సేవలను మరువలేమని ప్రధాని మోదీ ప్రశంసించారు. నార్త్‌ఈస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మిలుగా అభివర్ణించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనిమిది పునాది స్తంభాలపై ప్రభుత్వం పనిచేయాలని ఉద్బోధించారు. అవి.. శాంతి, అధికారం, పర్యాటకం, 5జీ అనుసంధానం, సంస్కృతి, ప్రకృతి వ్యవసాయం, క్రీడలు పనిచేయగల శక్తి అని వివరించారు.

మరిన్ని వార్తలు